India's COVID Report: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కోవిడ్, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,309 కేసులు నమోదు; 75 లక్షలకు పైగా హెల్త్ కేర్ - ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి
COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, February 12: భారత్‌లో కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతోంది. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా టీకా లబ్ది పొందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నాటి గణాంకాల ప్రకారం 75,05,010 మంది హెల్త్ కేర్ - ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాలు వేయించుకున్నారు.

మరోవైపు, దేశంలో కొవిడ్ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9,309 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,08,80,603కు చేరింది. నిన్న ఒక్కరోజే 87 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,55,447 కు పెరిగింది.

India's COVID Status Update:

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,858 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,05,89,230 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,35,926 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.32% ఉండగా, ప్రస్తుతం తీవ్రత కేవలం (యాక్టివ్ కేసులు) 1.25% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.43% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక ఫిబ్రవరి 11 వరకు దేశవ్యాప్తంగా 20,47,89,784 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,65,944 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.