New Delhi, June 27: భారతదేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య ఈరోజు 5 లక్షలు దాటింది. ఒకరోజును మించి మరొకరోజు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 18,552 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 5,08,953 కు చేరింది. నిన్న ఒక్కరోజే 306 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 15,685 కు పెరిగింది.
అయితే గత 25 గంటల్లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 10,244 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,95,881 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,97,387 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
COVID19 India Update:
ప్రపంచవ్యాప్తంగా 9.9 మిలియన్లకు పైగా కరోనా బారిన పడ్డారు. మరొక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య ఒక కోటికి చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారిలో 5.3 మిలియన్లకు పైగా కోలుకున్నారని, 496,800 మందికి పైగా మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
దేశాల వారీగా చూస్తే, యునైటెడ్ స్టేట్స్ 2,552,956 పాజిటివ్ కేసులు మరియు 127,640 మరణాలతో అత్యంత నష్టపోయిన దేశంగా ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ (1,280,054 కేసులు, మరణాలు 56,109), రష్యా (620,794 కేసులు, 8,781 మరణాలు), నాల్గవ స్థానంలో భారతదేశం (5,08,953 కేసులు, 15,685 మరణాలు) ఉన్నాయి.