New Delhi, June 28: భారతదేశంలో మరోసారి రికార్డ్ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 19,906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 5,28,859 కు చేరింది. నిన్న ఒక్కరోజే 410 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16,095 కు పెరిగింది.
అయితే గత 24 గంటల్లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 13,832 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,09,713 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 203,051 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
COVID19 India Update:
ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య గత రాత్రే కోటి దాటిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.
గత ఏడాది డిసెంబర్‌లో చైనా దేశంలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ భయంకర వైరస్, సుమారు ఏడు నెలల్లోనే ప్రపంచమంతా విస్తరించి ఎవరూ ఊహించని భయంకరమైన మైలురాయిని చేరుకుంది.
వేసవి కాలంలో వ్యాప్తి మందగిస్తుందనే నమ్మకాన్ని కూడా ఈ వైరస్ పటాపంచలు చేసింది. ఎలాంటి వాతావరణంలోనైనా దాని ఉనికి కోల్పోకుండా వైరస్ అంతకంతకూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు, ఈ వైరస్ పుట్టుకకు కారణమైన చైనా నగరం ఈ వైరస్ బారి నుండి క్రమక్రమంగా బయటపడుతుండగా, ప్రపంచ దేశాలు మాత్రం వాక్సిన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకేతాలు ఇచ్చినట్లుగా ఈ ఏడాది చివరి వరకైనా కోవిడ్ కు వాక్సిన్ వస్తుందో లేదో చూడాలి.