COVID in India: దేశంలో కరోనా కల్లోలం, ఒక్కరోజులోనే అత్యధికంగా 28 వేలకు పైగా కేసులు, భారత్‌లో 849,553కు చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య, 22,674కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, July 12:  భారతదేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. ఒకరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య 20 వేలను దాటి 30 వేలలో నమోదయ్యే రోజులు సమీపించాయి.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 28,637  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 849,553 కు చేరింది. నిన్న ఒక్కరోజే 551 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 22,674 కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో  దేశవ్యాప్తంగా 19,235 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 534,620 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 292,258 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update: 

దేశంలో కొవిడ్ తీవ్రత అత్యధికంగా మహారాష్ట్రలో ఉంది. ఈ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,46,600 కు చేరుకుంది. మరణాల సంఖ్య 10,116 కు పెరిగింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,36,985 మంది బాధితులు కోలుకోగా, ఇంకా 99,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది.

తమిళనాడులో పాజిటివ్ కేసులు 1,34,226 కు పెరిగాయి. ఈ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 1,898 కు చేరింది. ఇప్పటివరకు 85,915 మంది కోలుకోగా, ఇంకా 46,413 యాక్టివ్ కేసులు ఉన్నట్లు నివేదించబడింది.

ఇక దేశ రాజధాని దిల్లీలో కూడా కొవిడ్ తీవ్రత భారీగానే ఉంది. ఇక్కడ మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,921 కు చేరుకోగా, మరణించిన వారి సంఖ్య 3,334 గా ఉంది.