Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, August 28: భారతదేశంలో కరోనావైరస్ రోజురోజుకి మరింత వ్యాప్తి చెందుతోంది, దేశంలో వైరస్ ప్రవేశించి ఇన్నిరోజులు గడుస్తున్నా ఇప్పటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయే తప్ప, ఎలాంటి ఆశాజనక మార్పు కనిపించడం లేదు. నిన్న ఒక్కరోజులోనే దేశంలో అత్యధికంగా 75 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈరోజు ఆ రికార్డును సైతం చెరిపేస్తూ 77 వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 77,266 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 33,87,501 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,057 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 60,472 కు పెరిగింది.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం ఊరట కల్పించే విషయం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 60,176 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 25,83,948 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 7,42,023 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఇక ఆగస్టు 27 వరకు దేశవ్యాప్తంగా 3,94,77,848 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9,01,338 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారించబడిన కేసులు 7 లక్షలు దాటాయి.నిన్నటివరకు మొత్తం కేసుల సంఖ్య 7,33,568గా ఉండగా, మరణాల సంఖ్య 23,444 గా ఉంది.

మహారాష్ట్ర తర్వాత 4,03,242 కేసులు, 6948 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, సమీపంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3,93,090 కేసులు మరియు 3,633 కరోనా మరణాలతో మూడో స్థానంలో ఉంది.