Population(Photo-ANI)

India Now World's Most Populous Country: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్‌ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు UN వెల్లడించింది.

స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌, 2023 (State of World Population Report, 2023) పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ (UNFPA) నివేదికను విడుదల చేసింది. దీనిప్రకారం భారత్‌లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పేర్కొన్నది. చైనా జనాభా 142.57 కోట్ల మంది అని తెలిపింది. దీని ప్రకారం చైనా కంటే 29 లక్షల జనాభా భారత్‌లో ఎక్కువగా ఉంది. ఇక 340 మిలియన్లతో అమెరికా (USA) మూడో స్థానంలో ఉందని వెల్లడించింది.

ప్రధాని మోదీని కలిసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన

అయితే చైనాను భారత్‌ ఎప్పుడు అధిగమించిందనే విషయాన్ని స్పష్టం చేయలేదు. 2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తున్నది. కాగా 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ప్రపంచ జనాభాలో (804.5 కోట్లు) మూడింటా ఒక వంతు ఈ రెండు దేశాల్లోనే ఉన్నదని తాజా నివేదిక పేర్కొన్నది.

చైనా జనాభా గతేడాది పీక్‍కు చేరిందని, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని, ఇండియా జనాభా మాత్రం పెరుగుతోందని వెల్లడించింది. గత ఆరు దశాబ్దాలో తొలిసారిగా 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. జనాభా పెరుగుదల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సైతం విఫలమవుతున్నాయి. 2022లో ఏకంగా చైనాలో 8,50,000 జనాభా తగ్గిపోయింది. అయితే 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్, చైనాను ఈ ఏడాది మధ్యలో అధిగమిస్తుందని తెలిపిన యుఎన్ నివేదిక

అయితే 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది. భారతదేశ జనాభాలో 0 నుంచి 14 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు 25 శాతం ఉన్నారని, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 18 శాతం, 10 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్కులు 26 శాతం ఉన్నారని డేటా వెల్లడించింది. ఇండియాలో 15 నుంచి 64 ఏండ్ల వయసు మధ్య ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు జనాభాలో 7 శాతంగా ఉన్నారని పేర్కొన్నది.

ఐరాస వెలువరించిన వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022 ప్రకారం.. గతేడాది నవంబర్‌ 15న ప్రపంచ జనాభా 800కోట్లు దాటింది. 1990లో చైనా జనాభా 114.4కోట్లు ఉండగా.. భారత జనాభా కేవలం 86.1కోట్లు మాత్రమే. గతేడాది నాటికి మనదేశ జనాభా 141.2కోట్లకు చేరగా.. చైనా జనాభా 142.6కోట్ల వద్దే ఉంది. ఇలా 2050 నాటికి భారతదేశ జనాభా 166.8 కోట్లకు పెరుగుతుందని తాజా నివేదిక అంచనా వేసింది. అదే చైనా జనాభా మాత్రం 131.7కోట్లకు పడిపోతుందని పేర్కొంది.

భారత్‌లో జనాభా వేగంగా పెరుగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్‌ఎఫ్‌పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్‌నార్‌ పేర్కొన్నారు. అయితే, జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.

కాగా గతంలో యూఎన్‌తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తే ఏప్రిల్‌లోనే ఈ రికార్టు నెలకొల్పనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, జనాభాకు సంబంధించి భారత్‌, చైనా నుంచి సరైన సమాచారం అందకపోవడం వల్లే ఈ రికార్డు తేదీని కచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు ఐరాస జనాభా విభాగం అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో 2011లో జనగణన జరిగింది. తిరిగి 2021లో వాటిని చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా జాప్యమైంది.