Prithvi-II Ballistic Missile: ఒడిశా తీరం నుంచి పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి రాత్రి వేళ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్, ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి
File image of Prithvi-II test-fire | (Photo Credits: DRDO)

Balasore, December 4:  ఒడిశాలో రాష్ట్రంలోని బాలసోర్ తీరం నుంచి నిన్న రాత్రి పృథ్వీ -2 బాలిస్టిక్ క్షిపణి (Prithvi-II ballistic missile)  ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది.  స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అధ్వర్యంలో ఛండీపూర్ డిఫెన్స్ లాంచ్ కాంప్లెక్స్- 3 నుంచి ఈ క్షిపణి నైట్ టెస్ట్ ఫైరింగ్ (night test-firing) నిర్వహించారు. నివేదికల ప్రకారం, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం మంగళవారం రాత్రి 7.48 గంటలకు నిర్వహించినట్లు తెలుస్తుంది. అంతకుముందు, ఈ ఏడాది నవంబర్ 20న కూడా ఇదే స్థావరం నుండి పృథ్వీ -2 నైట్ టెస్ట్ ఫైరింగ్ చేపట్టారు. దీంతో భారత్ రెండు ఈ మిసైల్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేనట్లయింది.

పృథ్వీ -2 బాలిస్టిక్ క్షిపణి 350 కి.మీ దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించగలిగే పరిధి కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మిసైల్ 500 నుండి 1,000 కిలోల వార్‌హెడ్‌లను మోయగల సామర్థ్యం కలది. ఇది లిక్విడ్ ప్రొపల్షన్ ట్విన్ ఇంజన్లతో పనిచేస్తుంది. 2003లో పృథ్వీ -2 బాలిస్టిక్ క్షిపణి భారత రక్షణ దళాల అమ్ముల పొదిలో చేర్చబడింది.

9 మీటర్ల ఎత్తు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే తొలి 'పృథ్వీ' మిసైల్ ను ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ కార్యక్రమం (IGMDP) కింద డిఆర్‌డిఓ ( DRDO ) అభివృద్ధి పరిచింది. లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకునేలా ఈ మిసైల్స్ ను అభివృద్ధిపరిచే ప్రారంభ దశలోనే అధునాతన టెక్నాలజీని వినియోగిస్తారు.

అలా తయారుచేయబడిన మిస్సైల్స్ స్టాక్ నుంచి కొన్నింటిని ఎన్నుకొని, మిస్సైల్స్ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవటానికి DRDO శాస్త్రవేత్తల పర్యవేక్షణలో భారత రక్షణ దళాలు తమ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ తరహా క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తారు.