New Delhi, Sep 15: అంతర్జాతీయ వేదికపై దాయాదిదేశం పాకిస్తాన్ (Pakistan) మరోసారి కపట బుద్దిని ప్రదర్శించింది. రష్యా రాజధాని మాస్కోలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) సమావేశాల్లో (SCO Meet) భాగంగా జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల భేటీలో పాకిస్థాన్ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించింది. భారత్‌కు చెందిన కశ్మీర్ ప్రాంతాలతో కూడిన మ్యాప్‌ను పాకిస్థాన్ ఆ భేటీలో చూపించింది. దీన్ని ఖండించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (NSA Ajit Doval) ఆ సమావేశం నుంచి వాకౌట్ (India Walks Out of SCO Meet) చేశారు.
సీఎస్ఓ భేటీకి ఆతిథ్యం ఇస్తున్న రష్యాతో చర్చలు జరిపిన తర్వాతే మన దేశం వాకౌట్ చేసింది. సెప్టెంబర్ 15న జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) ఎన్ఎస్ఏ భేటీలో పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా కల్పిత మ్యాప్‌ను ప్రదర్శించింది. ఈ విషయమై ఆతిథ్య దేశం రష్యాకు సమాచారం ఇవ్వగా.. అతిథ్య దేశ సూచనలను సైతం పాక్ పట్టించుకోలేదు. ఇది సమావేశ నిబంధనలకు విరుద్ధం. దీంతో రష్యాతో చర్చించి భేటీ మధ్యలోనే వాకౌట్’ చేశామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నవారి ఆంక్షలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని, పాక్ వ్యవహార శైలిని ఖండిస్తూ భారత్ ఆ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ్ (External Affairs Ministry Spokesperson Anurag Srivastava) తెలిపారు. ఎస్‌సీవో చార్టర్‌ను పాకిస్థాన్ దారుణంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్ తన అభ్యంతరాన్ని గట్టిగా వినిపించిందని, పాకిస్థాన్‌ను మ్యాప్ చూపించకుండా ఉండేదుకు రష్యా కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్థాన్ వైఖరికి రష్యా మద్దతు ఇవ్వడం లేదని ఆ దేశ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి నికొలాయి పత్రుషేవ్ తెలిపారు. పాక్ రెచ్చగొట్టే చర్యలతో ఎస్‌సీవోలో భారత్ పాత్రకు ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. పాక్ చూపింని మ్యాప్‌లో జమ్మూకశ్మీర్, లడాఖ్‌లోని భాగాలతో పాటు గుజరాత్‌లోని జునాగడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాగా రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరించిన తీరు వల్ల.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో భారత్ పాల్గొనడంపై ప్రభావం చూపబోదని ఆశిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. తర్వాతి కార్యక్రమాల్లో భారత్ పాల్గొంటుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆగస్టు 4న కొత్త పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసిన పాకిస్థాన్.. భారత్‌లోని జమ్మూ కశ్మీర్, లడఖ్‌తోపాటు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా అందులో పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది పూర్తి కాబోతున్న తరుణంలో పాకిస్థాన్ ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. కాగా పాక్ చర్యను భారత్ ఖండించింది.