New Delhi, April 27: భారత్‌లో నిన్న కొత్తగా 3,23,144 మందికి కరోనా నిర్ధారణ (3,23,144 New Coronavirus Cases) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 2,51,827 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు (Coronavirus Cases in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 2,771 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. 28,82,204 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14,52,71,186 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,09,79,877 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,58,700 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తీవ్ర నీరసం, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా తగ్గిపోవడం కూడా కరోనా ఇన్ఫెక్షన్ ప్రాథమిక లక్షణంగా భావించాల్సి ఉంటుందని ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా లక్షణాలతో తమ వద్దకు వచ్చిన ఎంతోమందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వారు అంటున్నారు. తీవ్ర నీరసం, రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోవడాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకుంటే.. తర్వాతి దశలో జ్వరం, శ్వాస తీసుకునే సమస్యలు కూడా చుట్టుముడుతాయని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల కథనం ప్రకారం.. నీరసంగా అనిపించడంతో ఈనెల 18న ఓ వ్యక్తి రక్తపరీక్ష చేయించుకోగా ప్లేట్‌లెట్లు 4.5 లక్షల నుంచి 85వేలకు తగ్గిపోయినట్లు గుర్తించారు. దీంతో వైద్యుడి రాసిచ్చిన మందులను వాడుతుండగా ఏప్రిల్ 23న శ్వాస సమస్య కూడా మొదలైంది. అనుమానంతో అతడు మరోసారి రక్తపరీక్ష చేయించుకోగా ప్లేట్‌లెట్లు 20వేలకు పడిపోయినట్లు వెల్లడైంది. ఈ పరిణామంతో మేల్కొన్న బాధిత కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రుల్లో చేర్పించే ప్రయత్నం చేయగా.. ఆక్సిజన్ బెడ్లు లేవంటూ ఎక్కడా చేర్చుకోలేదు. ఇలా వైద్యసహాయం కోసం ఎదురుచూస్తూనే అతడు చనిపోయాడని కుటుంబీకులు చెప్పారు.