Cheetah Helicopter Crashes: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్, ఇద్దరు పైలెట్లు మృతి, ఆకాశంలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో సిగ్నల్‌ సరిగా కనిపించక హెలికాప్టర్‌ ప్రమాదం
Indian Army Cheetah Helicopter Crash. (Photo Credits: Twitter@indianrightwing)

Jammu, September 21: జమ్మూలో ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్‌ ప్రాంతంలో (Cheetah Helicopter Crashes) కుప్పకూలింది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, దురదృష్టవశాత్తూ పైలెట్లు ఇద్దరూ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

ఆకాశంలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో సిగ్నల్‌ సరిగా కనిపించక హెలికాప్టర్‌ ప్రమాదం (Indian Army Cheetah Helicopter Crashes) జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌదరి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. శివ్ గఢ్ ధార్‌లో ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలను పంపించామని తెలిపారు. ఈ ప్రాంతంలో అధిక పొగమంచు ఉందని తెలిపారు. మృతులు మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనుజ్ రాజ్‌పుత్ అని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు హెలికాప్టర్ వద్దకు చేరుకుని పైలట్లను కాపాడే ప్రయత్నం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.