New Delhi, December 18: భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) సరిహద్దు వద్ద ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్‌తో ఏ క్షణంలోనైనా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని జనరల్ రావత్ హెచ్చరించారు. ఒకవైపు దేశంలో వివిధ కారణాలతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ, మరోసారి జమ్మూకాశ్మీర్ (Jammu-Kashmir) అంశంలో అదనుకోసం పొరుగున ఉన్న దాయాది దేశం ఎదురుచూస్తుందంటూ ఆర్మీ చీఫ్ తాజాగా చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమవుతున్నాయి.
పాకిస్తాన్ (Pakistan) యొక్క శత్రు ప్రవర్తన కారణంగా నియంత్రణ రేఖ (LoC) వెంబడి పరిస్థితి ఉద్రిక్త వాతావరణం ఉంది. ప్రతీకారేచ్ఛతో రగులుతున్న పాకిస్థాన్‌కు దీటైన జవాబు ఇచ్చేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని రావత్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన దగ్గర్నించీ పాకిస్తాన్ నిరంతరాయంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతుందని రావత్ చెబుతూ, సరిహద్దు వద్ద తాజా పరిస్థితిపై ఆయన తర్వాత భారత ఆర్మీ చీఫ్ పగ్గాలు చేపట్టబోయే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నరవానేను అప్రమత్తం చేస్తున్నారు.
మొన్న సోమవారం కూడా పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు వేర్వేరు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని, మరో జవానుకు తీవ్రగాయాలయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆగష్టు- అక్టోబర్ నెలల మధ్య మొత్తం 950 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు నమోదైనట్లు వెల్లడించారు.