INS Brahmaputra Fire

Mumbai, July 22: ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో (INS Brahmaputra Fire) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయిలోని డాక్‌యార్డులో (Dockyard) ఉన్న ఈ యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లు నౌకాదళం వెల్లడించింది. ఈ ఘటనలో ఓ జూనియర్‌ నావికుడు గల్లంతు కాగా.. అతడి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. మిగతా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళం పేర్కొంది. ప్రమాదంలో యుద్ధనౌక (Warship) ఓవైపు ఒరిగిపోయిందని.. సరైన స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అవి సఫలం కాలేదని సమాచారం. మరమ్మతుల కోసం డాక్‌యార్డులో నిలిపిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

 

‘‘ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్టులో ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రకు (INS Brahmaputra Fire) మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది’ అని నౌకాదళం ప్రకటనలో పేర్కొంది. అయితే, సోమవారం మధ్యాహ్నానికి నౌక ఓ పక్కకు ఒరిగిపోయిందని.. దాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు అన్నివిధాలా కృషి చేసినప్పటికీ అది సాధ్యం కాలేదని తెలిపింది. ఒక జూనియర్‌ నావికుడు మినహా మిగతా సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని.. గల్లంతైన నావికుడి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంటూ నౌకాదళం ఓ ప్రకటన విడుదల చేసింది.