Representational image, Indian Railways | Photo Credits : Wiki Commons

New Delhi, Aug 7: ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు (Indian Railways ‘Khalasi’ System) ఇక నుంచి ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెలిఫోన్‌ అటెండెంట్‌ కమ్‌ డాక్‌ ఖలాసీల(టీఏడీకే)కు (telephone attendant-cum-dak khalasis (TADKs) సంబంధించిన నియామక ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు పేర్కొంటూ రైల్వే శాఖ (Indian Railways) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జూలై 1, 2020 నాటికి చేపట్టిన నియామకాలను రైల్వే బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని రైల్వే సంస్థలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంగస్తంభన ఔషధంతో కరోనాకు చెక్, ఆర్ఎల్‌ఎఫ్-100 కోవిడ్ కు విరుగుడుగా పనిచేస్తుందని తెలిపిన హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్, సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలు

కాగా టీఏడీకే గ్రూప్‌ డీ కేటగిరీ ఉద్యోగులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. సీనియర్‌ రైల్వే అధికారుల నివాసాల వద్ద ఫోన్‌ కాల్స్‌ అటెండ్‌ చేయడం, ఫైల్స్‌ అందించడం వంటి పనుల చేస్తారు. అయితే చాలా మంది అధికారులు టీఏడీకేలను తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లుతుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక వివిధ విభాగాల్లో కాలానుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టిన రైల్వే శాఖ.. ఇప్పటికే డాక్‌ మెసేంజర్‌ వ్యవస్థకు చరమగీతం పాడిన విషయం తెలిసిందే.

దీనికి బదులుగా వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా మెయిల్స్‌ ద్వారా సమాచారం చేరవేయాలని అధికారులకు సూచించింది. కాగా రవాణా రంగంలో శతాబ్దిన్నరకు మించి అనుభవం గడించి, రోజూ 22,000 రైళ్లు నడుపుతూ ప్రపంచ రైల్వేల్లోనే నాలుగో స్థానం ఆక్రమించిన రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది.