Coronavirus Outbreak in India . |(Photo Credits: PTI)

New Delhi, May 10:  భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు కొంతకాలం క్రితం రోజుకు వెయ్యి వచ్చే కేసులు ఆ తర్వాత రెండు వేలకు పెరిగింది, గత వారం రోజుల్లో ఈ సంఖ్య మూడు వేలకు పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,377 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 62,939 దాటింది. నిన్న ఒక్కరోజే 128 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,109 కి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

నిన్న దేశవ్యాప్తంగా 1512 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 19,357 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 41,472 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్రలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 20 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్ర వ్యాప్తంగా 1,165 పాజిటివ్ కేసులు మరియు 48 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 20,228 చేరగా, మరణాల సంఖ్య 779కు పెరిగింది.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు 10 ప్రత్యేక వైద్య, ఆరోగ్య బృందాలను పంపించాలని కేంద్ర పభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో గుజరాత్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నాయి. ఈ ప్రత్యేక వైద్య బృందాలు ఆదివారం నుంచి వారికి నిర్ధేషించబడిన రాష్ట్రాలలో పర్యటిస్తూ ఆయా రాష్ట్రాలలో లాక్డౌన్ స్థితిగతులు, కోవిడ్-19 పేషెంట్లకు అందుతున్న వైద్యానికి సంబంధించి వివరాలు తెలుసుకుంటాయి. అంతేకాకుండా కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి వీలుగా రాష్ట్ర ఆరోగ్య విభాగాలకు సహాయం చేస్తాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.