Coronavirus outbreak in India (Photo Credits: IANS)

New Delhi, October 8:  భారతదేశంలో కొవిడ్ విజృంభన కొనసాగుతోంది. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న పాజిటివ్ కేసులతో భారత్ యొక్క కొవిడ్ సంఖ్య ప్రతిరోజూ లక్ష చొప్పున పైకి ఎగబాకుతోంది. గురువారం ఉదయం నాటికి ఈ సంఖ్య 68 లక్షలకు చేరువైంది, అటు కొవిడ్ మరణాలు కూడా లక్షకు అతి చేరువగా వచ్చాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 78,524 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 68,35,656కు చేరింది. నిన్న ఒక్కరోజే 971 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,05,526కు పెరిగింది.

మరోవైపు  ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులకు తగినట్లుగా ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా దాదాపు సమానంగా ఉండటం విశేషం.  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 83,012 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 58,27,705 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 9,02,425 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Here's the update: 

ఇక అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా 8,34,659,75 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,94,321 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య  36 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు  1,054,600  కు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

గురువారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,068,991 గా ఉండగా, మరణాలు  1,054,609కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.