COVID19 in India: భారత్‌లో 30 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 69,239 పాజిటివ్ కేసులు నమోదు, 56 వేలు దాటిన కరోనా మరణాలు
Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, August 23:  భారతదేశంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు, నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్కరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య 70 వేలకు చేరువగా ఉంటోంది. దీంతో ఆదివారం ఉదయం నాటికి భారతదేశ కొవిడ్ కేసుల సంఖ్య 30 లక్షల మార్కును దాటేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 69,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 30,44,941 కు చేరింది. నిన్న ఒక్కరోజే 912 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 56,706 కు పెరిగింది.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం ఊరట కల్పించే విషయం.  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 57,988 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 22,80,566 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 7,07,668 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఇక ఆగస్టు 22 వరకు దేశవ్యాప్తంగా 3,52,92,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 8,01,147 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

India's COVID19 Update:

కొవిడ్ తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య నిన్నటికే 3,45,216 దాటింది. ఇక్కడ కొవిడ్ మరణాల సంఖ్య కూడా భారీగానే సుమారు 3,200 వరకు నమోదయ్యాయి.

ఇక కొవిడ్ కేసుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 14,492 పాజిటివ్ కేసులు, 297 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 6,71,942 దాటగా, మరణాల సంఖ్య 22 వేలు దాటింది.

రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో నిన్న కొత్తగా మరో 5,980 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 3,73,410కి చేరింది. మరోవైపు కర్ణాటకలో కూడా నిన్న ఒక్కరోజే 7,330 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో కర్ణాటకలో కొవిడ్ కేసుల సంఖ్య 2,71,876కు చేరుకుంది. ఎటొచ్చి తెలంగాణలో ప్రతిరోజు వెయ్యి, రెండు వేలుగా చూపుతున్న కేసులతో తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య శనివారం లక్ష దాటింది, ఆదివారం ఉదయం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,249 చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.