Coronavirus outbreak in India (Photo Credits: IANS)

New Delhi, September 17: భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత కొంత కాలంగా ప్రతిరోజు నమోదయ్యే కేసులు లక్షకు చేరువగా ఉండటంతో దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య 51 లక్షలు దాటింది. రేపు, రేపు ఒకరోజులో లక్షకు పైగా కేసులు నమోదవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 97,894 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం.  తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 51,18,254కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,132 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 83,198 కు పెరిగింది.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం ఊరట కల్పించే విషయం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 82,720 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 40,25,080 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 10,09,976 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలు కొవిడ్ నియమాలు పాటించాలంటూ విస్తృత ప్రచారం చేస్తోంది. మాస్క్, శానిటైజర్ ద్వారా ఎలా కరోనావైరస్ ను ఓడించవచ్చో తెలిపేవిధంగా సోషల్ మీడియాలో ఆకట్టుకునే పోస్టులు చేస్తుంది.

#IndiaFightsCorona

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 78.64% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 19.73% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.63% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక సెప్టెంబర్ 16 వరకు దేశవ్యాప్తంగా 6,05,65,728 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,36,613 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య గురువారం 30 మిలియన్ల మార్కును దాటే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.