COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, September 25:  భారతదేశంలో కొవిడ్ విజృంభన కొనసాగుతోంది. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న పాజిటివ్ కేసులతో భారత్ యొక్క కొవిడ్ సంఖ్య ప్రతిరోజూ లక్ష చొప్పున పైకి ఎగబాకుతోంది. శుక్రవారం ఉదయం నాటికి ఈ సంఖ్య 58 లక్షలు దాటేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 86,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 58,18,571 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,141 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 92,290కు పెరిగింది.

మరోవైపు  ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులకు తగినట్లుగా ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా సరిసమానంగా ఉండటం విశేషం. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 81,177కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 47,56,165 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 9,70,116 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Here's the update: 

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.74% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 16.67% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.59% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక సెప్టెంబర్ 24 వరకు దేశవ్యాప్తంగా 6,89,28,440 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 14,92,409 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.