COVID in India| Representational Image (Photo Credits: IANS)

New Delhi, October 14:  భారతదేశంలో కొవిడ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినా, వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో కంటే కొత్తగా నమోదయ్యే కేసులు గణనీయంగా తగ్గాయి. మహారాష్ట్ర మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది.  మాస్కులు, శానిటైజర్ల వాడకం పట్ల ప్రజల్లో అవగాహన రావడమే కేసులను నియంత్రించడం సాధ్యపడుతోంది. నిర్లక్ష్యం వహించకుండా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే ప్రభుత్వం చెబుతోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో  63,509 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 72,39,390కు చేరింది. నిన్న ఒక్కరోజే 730 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,10,586కు పెరిగింది.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 74,633 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 63,01,928 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 8,26,876 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 87.05% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 11.42% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.53% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక అక్టోబర్ 13 వరకు దేశవ్యాప్తంగా 9,00,90,122 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,45,015 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. ఈ రాష్ట్రంలో కేసులు 15,43,837కు చేరగా, కొవిడ్ మరణాలు 40,701కు పెరిగాయి. గణాంకాల ప్రకారం మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ మరియు దిల్లీ రాష్ట్రాలు కొనసాగుతున్నాయి.