Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

New Delhi, September 10: భారతదేశంలో కరోనావైరస్ రోజురోజుకి మరింత ఉగ్రరూపం దాల్చుతుంది, ఒకప్పుడు దేశంలో ఒకటి, రెండుగా ఉన్న కేసులే ఉలిక్కిపడేలా చేయగా, ఇటీవల కాలంగా ఒక్కరోజులోనే 50 వేలు, 60 వేలు, 70 వేలు అంటూ నమోదవడం దాటి ఇప్పుడు ఏకంగా లక్షకు చేరువగా కేసులు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 95,735 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 44,65,864 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,172 COVID మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 75,062 కు పెరిగింది.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం ఊరట కలిగించే విషయం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 72,939 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇప్పటివరకు 34,71,783 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 9,19,018 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 77.74% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 20.58% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.68% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక సెప్టెంబర్ 9 వరకు దేశవ్యాప్తంగా 5,29,34,433 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,29,756 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి దారుణంగా ఉంది, నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో 23,816 పాజిటివ్ కేసులు, 325 కరోనా మరణాలు నమోదయ్యాయి.  వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారించబడిన కేసులు 9.67 లక్షలు దాటాయి. నిన్నటివరకు మొత్తం కేసుల సంఖ్య 9,67,349గా ఉండగా, మరణాల సంఖ్య 27,787గా ఉంది.

మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,27,512 కేసులు మరియు 4,634 కరోనా మరణాలతో రెండో స్థానంలో ఉండగా, సమీపంలోనే  4,80,524 కేసులు మరియు 8,090 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది.