Mumbai, November 10: దేశంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 38,074 కరోనా కేసులు (Coronavirus in India) నమోదు అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 85,91,731కు చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 448 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,27,059 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,05,265 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. ఇప్పటి వరకూ 79,59,406 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.32 శాతం ఉండగా.. మరణాల రేటు 1.49 శాతంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీ రోజువారీ కేసుల నమోదులో మహారాష్ట్రను అదిగమించింది. వారం రోజులుగా నిత్యం సుమారు ఏడు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ తొలి వారంలోనే 46 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఒక్క వారంలో 427 మంది కరోనా రోగులు మరణించడం కలకలం రేపుతున్నది. ఢిల్లీలో కరోనా మరణాలను పరిశీలిస్తే.. ఆగస్టు నెలలో 458 మరణాలు నమోదు కాగా సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 917కు పెరిగింది. అక్టోబర్ 1 నుంచి 31 వరకు 1,124 మంది వైరస్ వల్ల చనిపోయారు. ఇక నవంబర్ 1 నుంచి 7 వరకు వారం రోజుల్లో 427 మంది మృత్యువాతపడ్డారు. ఢిల్లీలో జూన్ నెలలో అత్యధికంగా 2,247 కరోనా మరణాలు నమోదయ్యాయి.
హైట్ తక్కువ వాళ్లకి కరోనాతో చాలా డేంజరట
తాజాగా మరోసారి మరణాల రేటు పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా మరణాల రేటు 1.59 శాతం ఉన్నది. జాతీయ స్థాయి కన్నా ఇది కాస్త ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు కరోనా కేసులు మూడు రెట్లు పెరిగాయి. ఆదివారం ఒక్క రోజే అత్యధికంగా 7,745 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.38 లక్షలు దాటగా మొత్తం మరణాల సంఖ్య ఏడు వేలకు చేరింది.
అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, యూరోప్‌కు చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. తమ ఫలితాలు తెలిసిన నేటి రోజు సైన్సుకూ, మానవాళికి చాలా మంచి రోజు అని అభిప్రాయపడ్డారు. మూడో దశ ప్రయోగం వల్ల తమ వ్యాక్సిన్ కరోనాను అడ్డుకుంటోందని తెలుస్తోందని చెప్పారు. ప్రపంచానికి అత్యవసరమైన కరోనా వ్యాక్సిన్ త్వరలోనే తమ నుంచి వచ్చే వకాశం ఉందని తెలిపారు.
ఫైజల్, బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జూలై 27న ప్రారంభమైంది. మొత్తం 38,955 మందికి నవంబర్ 8 నాటికి వ్యాక్సిన్ ఇచ్చారు. రెండో, మూడో దశ ప్రయోగాల్లో వచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు తెలిపాయి. అయితే, పరిశీలన పూర్తయ్యే నాటికి ఈ డేటా మారే అవకాశం ఉందని ఫైజర్ కంపెనీ ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ యేడాది చివరి నాటికి టీకా వచ్చే అవకాశాలున్నాయన్నారు.