COVID19 in India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 75,760 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 33 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య,  60 వేలు దాటిన కరోనా మరణాలు
Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

New Delhi, August 27:  భారతదేశంలో కరోనా వీరవిహారం కొనసాగుతోంది. ఒకరోజుని మించి ఒకరోజు రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వారాల వ్యవధిలోనే ఒక్కరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య 50 వేలు, 60 వేలు దాటి  ఏకంగా 75 వేల మార్కును సైతం చేరుకోవడాన్ని చూస్తే దేశంలో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం ఉదయం నాటికి భారతదేశ కొవిడ్ కేసుల సంఖ్య 33 లక్షల మార్కును దాటేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 75,760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో రికార్డ్ అయిన కేసుల సంఖ్యతో పోల్చితే ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 33,10,235 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,023 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 60,472 కు పెరిగింది.

మరోవైపు  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 56,014 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 25,23,772 6 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 7,25,991 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఇక ఆగస్టు 26 వరకు దేశవ్యాప్తంగా 3,85,76,510 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9,24,998 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 24 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు 8,24,000 కు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

గురువారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,085,646 గా ఉండగా, మరణాలు 824,368కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.