3rd Wave in India: సెకండ్ వేవ్ కంటే ఎక్కువ తీవ్రతతో థర్డ్ వేవ్, జనవరి మొదటివారంలోనే ఆర్ నాట్ వాల్యూ 4, రానున్న మరింత రోజుల్లో మరింత పెరిగే అవకాశం
Coronavirus outbreak in TS (Photo Credits: IANS)

New Delhi January 09:  భారత్‌ లో కరోనా థర్డ్ వేవ్‌(Third wave in India)పై కీలక విషయాలు వెల్లడించింది ఐఐటీ మద్రాస్(IIT Madras). ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రానున్న రోజుల్లో కేసుల తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు నిపుణులు. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్‌ నాట్‌ విలువ(R-naught value) జనవరి మొదటి వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌(Corona Third wave) ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్‌ నాట్‌ వాల్యూ(R-naught value) లేదంటే ఆర్‌ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క.

Omicron In India:భారత్‌లో లక్షన్నర దాటిన కరోనా కేసులు, భారీగా పెరిగిన యాక్టీవ్ కేసులు, 3623 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు

డెల్టా వేరియెంట్‌ ప్రబలి కరోనా సెకండ్‌ వేవ్‌(Second wave) దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్‌ నాట్‌ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్‌ వేరియెంట్‌(Omicron variant) విజృంభిస్తున్న వేళ డిసెంబర్‌ 25–31 తేదీల్లో ఆర్‌ నాట్‌ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్‌ మోడల్‌లో ఐఐటీ మద్రాస్‌ కరోనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జయంత్‌ ఝా వెల్లడించారు.

వైరస్‌ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్‌ రేటు, వైరస్‌ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్‌ నాట్‌ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్‌ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్‌ రేటు తగ్గి ఆర్‌ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్‌ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్‌ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్‌ వాల్యూ మారవచ్చునని జయంత్‌ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్‌ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు.