Mumbai, January 23: ముంబై విమానాశ్రయం నుంచి గురువారం తెల్లవారు ఝామున హైదరాబాద్ (Mumbai- Hyderabad) బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo flight) ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ముంబైలో అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేయవలసి వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ (CSMIA) విమానాశ్రయం నుండి ఇండిగో ఫ్లైట్ 6ఇ -5384 (ఎ 320) గురువారం తెల్లవారుజామున 12.50 గంటలకు షెడ్యూల్ చేయబడింది. కానీ కాస్త ఆలస్యంగా ఉదయం 1.03 గంటలకు టేకాఫ్ తీసుకుంది.
అయితే, ఇది పుణె దాటిన (60 నాటికల్ మైళ్లు దాటిన) కొద్దిసేపటికి ఇంజన్ 1కు సంబంధించి పైలట్ కు హెచ్చరిక సిగ్నల్స్ వచ్చాయి. ఇంజన్ 1 పనిచేయడం ఆగిపోయిందని గుర్తించి పైలట్ వెంటనే అప్రమత్తమై 1.17 సమయంలో PAN- PAN (అంతర్జాతీయ ప్రామాణిక అత్యవసర సిగ్నల్ కోడ్) ను ప్రకటించారు. విమానం ఇంజిన్1 ఆగిపోయిందని, ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) కు సమాచారం అందించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు.
దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ముంబై విమానాశ్రయ ప్రధాన రన్‌వే 27 వద్ద అత్యవసర స్థితిని ప్రకటించారు. మరే ఇతర విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే స్పందించేలా రన్‌వే వద్ద అంబులెన్స్‌లతో పాటు ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు. అలాగే అత్యవసర ల్యాండింగ్ కోసం వస్తున్న ఇండిగో విమాన పైలైట్ కు సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా తగిన సూచనలు చేస్తూ పోయారు. పైలట్ కూడా నిర్దేశించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించడంతో తెల్లవారు ఝామున 1.41 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందులోని ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
ప్రస్తుతం విమానం ఎయిర్ పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. కాగా, అందులోని ప్రయాణికులందరి కోసం మరో విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపించినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి.