రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి వరుసగా మూడోసారి బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో రూ.20కోట్లు, రూ.200కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈమెయిల్ ఇచ్చాయి. ఈసారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చిందని చెప్పారు.
నాలుగు రోజుల్లో అంబానీకి పంపిన మూడో బెదిరింపు ఈమెయిల్ ఇదని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 27న ఓ వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెయిల్ రావడంతో అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జీ చేసిన ఫిర్యాదు ఆధారంగా గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 28న రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఈమెయిల్ వచ్చింది.
తాజాగా కంపెనీకి సోమవారం మూడో ఈమెయిల్ వచ్చినట్లు అధికారి తెలిపారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచి, సైబర్ బ్రాంచి బృందాలు ఈమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను గతేడాది బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్‌ను పేల్చివేస్తామని నిందితులు గతంలో బెదిరించారు.