International Flight Suspension Extended: అంతర్జాతీయ విమానాలపై సెప్టెంబర్ 30 వరకు సస్పెన్షన్‌ పొడిగింపు, కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి ఈ నిషేధం వర్తించదని తెలిపిన కేంద్రం
Flights- Representative Image | File Photo

New Delhi, August 29: అంతర్జాతీయ విమానాలపై (International Flights) సస్పెన్షన్‌ను భారతదేశం పొడిగించింది. ఈ పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది. కొవిడ్-19 (Covid-19 pandemic) నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి భారతదేశానికి వచ్చే, వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలు ఎల్లుండి ముగియనున్నందున సమీక్షించిన ప్రభుత్వం.. ఈ ఆంక్షలను వచ్చే నెలాఖరు వరకు పొడిగిస్తూ (International Flight Suspension Extended) నిర్ణయం తీసుకున్నది.

అయితే, ఈ సస్సెన్షన్‌ కార్గో విమానాలకు, డీజీసీఏ (DGCA) ఆమోదించిన వాటికి వర్తించదు. అంతర్జాతీయంగా షెడ్యూల్ చేయబడిన విమానాలు కేస్ టు కేస్ ప్రాతిపదికన సమర్థ అధికారం ద్వారా ఎంపిక చేసిన మార్గాల్లో అనుమతించనున్నట్లు సర్క్యులర్‌లో ప్రభుత్వం పేర్కొన్నది. అంతర్జాతీయ ప్రయాణంపై విస్తృత ఆంక్షలు ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉన్న పౌరులు లేదా అర్హులైన కేసుల్లో స్వదేశానికి రప్పించడానికి కొన్ని విమానాలు అనుమతించనున్నారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో 28 దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాలపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంతకాలు చేసింది.

సుదీర్ఘ విరామం తర్వాత, సెప్టెంబర్ 3 నుంచి ఇండియా-బంగ్లాదేశ్ మధ్య విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గత ఏడాది రెండు దేశాలు సంతకం చేసిన ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం, నాలుగు నెలల తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.