New Delhi, Jan 12: శృంగారంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహమైనా, కాకున్నా ఇష్టంలేని శృంగారాన్ని తిరస్కరించే హక్కు మహిళకు ఉందని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ రాజీవ్ శక్దేర్, జస్టిస్ సి. హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం నిన్న ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహమైనంత మాత్రాన ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును ( Every Woman Has Right to Say No) మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది.
దాదాపు 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది నందితా రావ్ తన వాదనలు వినిపిస్తూ భర్తకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. వీటి వల్ల భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్టు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. దీంతో కలుగజేసుకున్న జస్టిస్ శక్దేర్.. మహిళ నెలసరిలో ఉన్నప్పుడు శృంగారానికి నిరాకరిస్తే, అప్పుడు అతడు బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదా? అని ప్రశ్నించారు.
దీనికి స్పందించిన నందిత రావ్.. అది నేరమే కానీ అత్యాచార పరిధిలోకి రాదని సమాధానమిచ్చారు. మరోమారు కల్పించుకున్న న్యాయమూర్తి.. ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకమవుతోందని, సహజీవనం చేసే వారి విషయంలో ఈ చర్య ఐపీసీ-375 పరిధిలోకి వస్తే, వివాహిత విషయంలో ఎందుకు రాదని ప్రశ్నించారు. సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదని న్యాయమూర్తి అన్నారు. ఐపీసీ సెక్షన్ 375 పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయా? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ ఆర్ఐటీ ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ ఫౌండేషన్ దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి.హరిశంకర్‌ల ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై బుధవారం కూడా విచారణ కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.