
New Delhi, July 27: దేశ వ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది. ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహణ (Jamili Elections) సాధ్యం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ (Arjun ram meghwal) ఎంపీలు అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జమిలి ఎన్నికలు అనే అంశం (Center on Jamili Elections) ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై.. సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు.ఎన్నికలను దేశమంతా ఒకేసారి జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు.
ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, అయితే ఇందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు సైతం ఉన్నాయన్నారు. రాజ్యాంగ సవరణ అవసరమని.. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరమని, అందుకు రూ.వేలకోట్లు ఖర్చవుతాయన్నారు. ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పని చేయవని, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.
అదే సమయంలో ఒకేసారి జరిగే ఎన్నికలకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరమవుతాయన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని, తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ్యులకు ఇచ్చిన లిఖిత్వపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.