జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (encounter) ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
మృతిచెందిన టెర్రిస్టులు లష్కరే తొయిబాకు చెందినవారిగా గుర్తించామన్నారు. వారిలో ఒకరు కన్మోహ్ సర్పంచ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. కాగా, ఈనెల 12న పుల్వామాలో ఉన్న చవల్కాన్‌లో, హంద్వారా జిల్లాలోని నెచమా, గందర్‌బాల్ జిల్లాలోలోని సెర్చ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఒకరు, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నారు.