Srinagar, DEC 28: జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్ (JK Encounter) జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని పజ్‌తీర్థి-సిధ్రా రోడ్డులో, బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. భారత భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించినట్లు సైన్యం తెలిపింది. ఉగ్రవాదులు, శ్రీనగర్ హైవేపై ట్రక్కులో వెళ్తుండగా, భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రక్కును చుట్టుముట్టిన సైన్యం కాల్పులు జరిపింది. దీంతో సైనికులపైకి తీవ్రవాదులు కూడా కాల్పులు ప్రారంభించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. కాల్పుల సందర్భంగా ఒక గ్రెనేడ్ కూడా పేలింది. ఘటన జరుగుతున్నప్పుడే ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
J&K | Visuals from Sidhra area of Jammu where an encounter is underway.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/YSgz0xRQrO
— ANI (@ANI) December 28, 2022
హతమైన ముగ్గురు తీవ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తాన్ని భద్రతాదళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. రహదారిని కూడా మూసేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారమే ఈ ప్రాంతంలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉదంపూర్ ప్రాంతంలో 15 కేజీల పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని నిర్వీర్యం చేశారు. ఆర్డీఎక్స్ (RDX), డిటోనేటర్ల వంటివి ఉపయోగించి ఈ ప్రాంతంలో పేలుడు సృష్టించేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు.