Ranchi, November 1: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Election 2019) తేదీలను భారత ఎన్నికల కమిషన్ (EC) శుక్రవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 30, డిసెంబర్ 7, డిసెంబర్ 12, డిసెంబర్ 16 మరియు డిసెంబర్ 20లలో మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అదే రోజున ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా (Sunil Arora) వెల్లడించారు.
ఝార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ (BJP) అధికారంలో ఉంది. ఝార్ఖండ్ శాసనసభ పదవీకాలం జనవరి 5తో ముగుస్తుంది, అయితే మహారాష్ట్ర, హర్యానాతో పాటు అక్టోబర్ 21నే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావించినప్పటికీ, పోల్ ప్యానెల్ ఎన్నికలను వాయిదా వేసింది.
2014లో ఝార్ఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి 37 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) 5 స్థానాలను దక్కించుకుంది. 81 మంది సభ్యుల శాసనసభలో ఇరు పార్టీలు కలిసి 41 మెజారిటీ మార్కును సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాగా, ఈ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 19 సీట్లు, జార్ఖండ్ వికాస్ మోర్చా 8 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 7 సీట్లకే పరిమితమైంది.
కాగా, ఇటీవల వెలువడిన మహరాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి, రెండు చోట్ల ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీని సాధించలేకపోయింది. వీటి ఫలితం ఝార్ఖండ్ లోనూ ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్న ప్రతిపక్ష పార్టీలు, ఈసారి ఝార్ఖండ్ లో బీజేపిని ఎలాగైనా ఓడించి అధికారంలోకి రావాలని మహకూటమిగా ఏర్పడుతున్నాయి.