
Andaman, OCT 27: జాబ్ ఫర్ సెక్స్ కుంభకోణం (Job-for-Sex Racket) జాతీయ స్థాయిలో కలకలంగా మారింది. ఈ కుంభకోణంలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ (Jitendra Narain ) అమానుషాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జితేంద్ర అండమాన్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఏడాది కాలంలో పోర్ట్ బ్లెయిర్ లోని అతని నివాసానికి 20మంది మహిళలను తీసుకెళ్లినట్లు దర్యాఫ్తులో తేలింది. జితేంద్ర నరైన్ (Jitendra Narain), లేబర్ కమిషనర్ ఆర్ఎల్ రిషి కలిసి 21ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జాబ్ (Job) వెతుక్కుంటున్న సమయంలో తనకు ఓ హోటల్ యజమాని ద్వారా రిషి పరిచయం అయ్యాడని, అతడు తనను చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి ఆర్ఎల్ రిషి, జితేంద్ర నరైన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, రెండు వారాల పాటు తనను తీవ్రంగా హింసించారని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని ఫిర్యాదు చేసింది.
ఇద్దరు అధికారుల కాల్ డేటా రికార్డులు, ఫోన్ టవర్ లొకేషన్స్.. యువతి చెప్పిన ఆధారాలతో సరిపోయాయని, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోర్ట్ బ్లెయిర్ (Port Bliar) నుంచి ఢిల్లీకి బదిలీ అయ్యే సమయంలో డిలీట్ చేసినట్లు నిర్దారించింది. నరైన్ సిబ్బంది సహా ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు 21ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగిందని వెల్లడించారు.
నరైన్ ఏడాది కాలంలో ఇలా 20మంది యువతులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో తేలింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నరైన్ ఖండించారు. ఈ కేసులో కుట్ర కోణం దాగుందని ఆరోపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరైన్ ను కేంద్ర హోంశాఖ విధుల నుంచి తప్పించింది. నవంబర్ 14 వరకు నరైన్ కు కోల్ కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ లభించింది.