New Delhi, July 26: అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రధాని మండిపడ్డారు. జులై 26వ తేదీ కార్గిల్ దివాస్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సైన్యంలో సంస్కరణల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు. సైన్యంలోకి యువ రక్తాన్ని తీసుకు రావడంతోపాటు యుద్దానికి ఎల్లవేళలా సన్నద్ధంగా ఉండే విధంగా యువతను తయారు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
తమ వ్యక్తిగత లాభం కోసం అగ్నిపథ్ పథకాన్ని (PM Narendra Modi Targets Opposition Over Agnipath) రాజకీయ అంశంగా మలుచుకున్నాయన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న ఆయా పార్టీల్లోని వ్యక్తులు.. గతంలో సైన్యంలో వేల కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడి సైన్యాన్ని బలహీన పరిచాయని ప్రధాని మోదీ వివరించారు. ఈ ఏడాది జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి 25 ఏళ్లు అయింది. ఆర్మీ తీసుకున్న సంస్కరణల్లో అగ్నిపథ్ స్కీమ్ కూడా భాగమేనన్నారు. ఆర్మీ అంటే కేవలం రాజకీయవేత్తలకు సెల్యూట్ చేయడం, పరేడ్‌ల్లో పాల్గొనడం అనే ఆలోచనలో కొందరు ఉన్నారని, కానీ ఆర్మీ అంటే 140 కోట్ల భారతీయుల నమ్మకం అని మోదీ తెలిపారు. భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజు, కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే,
కొందరు వ్యక్తుల ఆలోచనలకు ఏమైందో తెలియడం (Few People Are Misleading the Nation) లేదని, పెన్షన్ డబ్బులను ఆదా చేసేందుకు ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, కొత్తగా రిక్రూట్ అయినవాళ్లకు.. పెన్షన్ అనే అంశం 30 ఏళ్ల తర్వాత ఉత్పన్నం అవుతుందన్నారు. ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించామని, రాష్ట్రనీతి కోసం పనిచేస్తాం కానీ రాజనీతి కోసం కాదన్నారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం గురించి కూడా ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేశాయని, తమ ప్రభుత్వమే ఆ స్కీమ్‌ను అమలు చేసిందన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ కింద మాజీ సైనికులకు 1.25 లక్షల కోట్లు చెల్లించామన్నారు. సర్కారును విమర్శిస్తున్న ఆ పార్టీలు.. యుద్ధ స్మారకం నిర్మించలేదన్నారు. బోర్డర్‌లో ఉంటున్న సైనికులకు అవసరమైనన్ని బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ఇవ్వలేకపోయినట్లు విమర్శించారు. ప్రతిపక్షాలు మన ఆర్మీని బలహీనపరుస్తున్నాయన్నారు.
ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లు కోసం ద్రాస్ సెక్టర్‌లోని నిర్మించిన కార్గిల్ స్మారక స్థూపం వద్ద ప్రధాని మోదీ వారికి ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం దాదాపు మూడు నెలల పాటి సాగి జులై 26వ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా పొరుగునున్న దాయాది దేశం పాక్‌పై మండిపడ్డారు. పాకిస్థాన్ నేటికి గుణపాఠం నేర్చుకోలేదన్నారు.
ప్రధాని మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం యువతను సైన్యంలోకి తీసుకొనేందుకు అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లోని యువత సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు, నిరసనల బాట పట్టింది.
ఇక సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) సైతం ఈ అగ్నిపథ్ పథకంలో మార్పు, చేర్పులు చేయాలని ప్రధాని మోదీకి విజ్జప్తి చేసిన విషయం విధితమే.