Bajrang Dal activist Harsha (Photo Credits: ANI) Shivamogg, February 21:

Shivamogg, February 21: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ నగరంలో దొడ్డపేట పోలీసు స్టేషన్ పరిధిలో 23 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త, టైలర్ హర్షపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాణాలు (26-Year-Old Bajrang Dal Activist Allegedly Murdered) విడిచాడు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష ఆదివారం రాత్రి దారుణ హత్యకు (Bajrang Dal Activist Allegedly Murdered) గురవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య ఘటన అనంతరం కోపోద్రిక్తులైన భజరంగ్ దళ్ కార్యకర్తలు శివమొగ్గ నగరంలోని సీగేహట్టి ప్రాంతంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ఈ హత్య ఘటనతో శివమొగ్గలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ హత్య ఘటనపై శివమొగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివమొగ్గ నగరంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఈనేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. తాజా దాడికి హిజాబ్ వివాదం కారణం కాదని కర్ణాటక హోం శాఖ మంత్రి అరగా జ్ఞానేంద్ర ప్రకటించారు. ఈ అంశంలో ఒక ముగింపునకు రావడానికి ముందు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరారు. నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. హత్య వెనుక వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉందని, కనుక ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. రిజర్వ్ పోలీసు బలగాలను రంగంలోకి దించినట్టు చెప్పారు.

కర్ణాటకలో హిజాబ్‌ వివాదమేంటి? ఎందుకు విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు, కర్ణాటక హైకోర్టు దీనిపై ఏం చెబుతోంది, హిజాబ్‌ వివాదంపై పూర్తి కథనం ఇదే..

పోలీసుల చర్యల పట్ల తాము సంతోషంగా లేమని భజరంగ్ దళ్ కర్ణాటక కన్వీనర్ రఘు సకలేష్ పూర్ తెలిపారు. అతడు తమ చురుకైన కార్యకర్త అని, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఒక మతానికి చెందిన గూండాలు ఈ హత్యలో పాలుపంచుకున్నట్టు, వారిని కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ప్రేరేపించినట్టు కర్ణాటక రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప సంచలన ఆరోపణలు చేశారు.

ఇదిలాఉంటే . మృతుడిని బజరంగ్ దళ్ కార్యకర్త అయిన హర్ష్‌ అల్డోగా పోలీసులు గుర్తించారు. హర్ష్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడనే నెపంతో ఈ హత్య జరిగినట్లు బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. మృతుడి మృతదేహాన్ని శివమొగ్గలోని మెక్‌గన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టైలరింగ్ వృత్తి చేసుకుంటున్న హర్ష.. ప్రస్తుతం భజరంగ దళ్ శివమొగ్గ జిల్లా కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. భజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే హర్ష.. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నీ తానై వ్యవహరిస్తాడు. హర్ష హత్య విషయం తెలియడంతో వందల మంది హిందూ సంఘాల కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. మూడేళ్ల నుంచి హర్ష దుండగులకు టార్గెట్‌గా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.