Bangalore, March 19: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని తుముకురు జిల్లా పావగడ (Pavagada) పలవలహళ్లి వద్ద ఓ ప్రైవేటు బస్సు (Private bus) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పావగడలోని ఆస్పత్రికి తరలించారు. ఎస్‌వీటీ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు వైఎస్‌ హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 45మందికి పైగా ప్రయాణిస్తుండగా..బస్ టాప్ పైన కూడా 10నుంచి 15మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రమాదానికి గురి అయిన ఈ బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలక్టర్ వెంటనే అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యేతో పాటూ, పలువురు నేత సానుభూతిని వ్యక్తం చేశారు.