Bengaluru, Mar 31: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో (Karnataka Sex CD Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 28 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న యువతి అనేక నాటకీయ పరిణామాల మధ్య నిన్న మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి కోర్టులో హాజరవుతుందని ఆమె న్యాయవాది జగదీశ్ చెప్పడంతో ఏసీఎంఎం కోర్టు ఎదుట మీడియా, పోలీసులు ఎదురు చూశారు.
అక్కడ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. బాధిత యువతికి సిట్‌పై నమ్మకం లేదని, అంతేకాకుండా ఆమెకు ప్రాణభయం ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ఎదుటే వాంగ్మూలం ఇచ్చేలా అనుమతివ్వాలని కోర్టుకు విన్నవించగా జడ్జి బాలగోపాల్ కృష్ణ ఆమోదించారు. దీంతో న్యాయమూర్తి ఎదుట యువతి హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. బెంగళూరు వసంతనగరలోని గురునానక్ భవన్‌లో ఉన్న ఏసీఎంఎం కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక కోర్టుకి బాధిత యువతి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంది.
మంత్రి రమేశ్ జార్కిహొళి సెక్స్ వీడియో బయటకు, కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్న సీడీ
సుమారు రెండు గంటల పాటు జడ్జి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. అక్కడ ఒక స్టెనోగ్రాఫర్ మాత్రమే ఉన్నారు. ఆ తరువాత కోర్టు అనుమతితో సిట్ పోలీసులు యువతిని ఆధీనంలోకి తీసుకుని తమ ఆఫీసుకు తరలించారు. మంగళవారం రాత్రి వరకూ సిట్ ఆమెను విచారించి, మళ్లీ బుధవారం విచారణకు రావాలని తిరిగి పంపించివేశారు. తనకు రమేశ్ జార్కిహొళి (BJP MLA Ramesh Jarkiholi) ఇచ్చిన బహుమతులు, ఆయనతో తీసుకున్న ఫోటోలు, చేసిన చాటింగ్, వీడియో, మొబైల్ సందేశాల తదితర సాక్ష్యాలను సిట్‌కు అందించింది. మరోవైపు వైద్య పరీక్షలు చేసే వరకు తమ రక్షణలో ఉండాలని, అందుకోసం ఎనిమిది మంది మహిళా పోలీసులతో యువతికి భద్రత కల్పించినట్లు తెలిసింది.
బాధిత యువతి న్యాయవాది జగదీశ్ మాట్లాడుతూ... ‘తాము ఇచ్చిన మాట ప్రకారం బాధిత యువతిని కోర్టు ఎదుటకు తీసుకొచ్చాము. ఇక పోలీసులు వారి పనిని చేయాలి. నిందితుడు స్వేచ్ఛగా బయటకు తిరగకుండా అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. యువతి ఎలాంటి భయం లేకుండా జరిగినది మొత్తం న్యాయమూర్తి ఎదుట వెళ్లడించిందని ఆయన తెలిపారు. కాగా జడ్జి ముందు బాధిత యువతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.
‘నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఎమ్మెల్యే రమేశ్ బలమైన నాయకుడు కావడంతో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను ఆయన బెదిరించడంతో భయపడి దాక్కున్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడిని కూడా రమేశ్ ఒత్తిడి చేస్తున్నారు. నా కుటుబానికి రక్షణ కల్పించాలి’ అని యువతి కోరినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సీడీ కేసులో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి ఒంటరిగా మిగిలిపోయారు. ఆయనతో పాటు యడ్డ్యూరప్ప సర్కారులో మంత్రులైన నేతలు ఆయనకు దూరం పాటిస్తున్నారు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి ఏకంగా జడ్జి ముందు వాదన వినిపించడంతో ఎమ్మెల్యేకు అరెస్టు భయం పట్టుకుంది. జార్కిహొళి ప్రమాదకర మనిషి అని, తనను చంపినా చంపవచ్చని యువతి పలు వీడియోల్లో ఆరోపించడం తెలిసిందే. మంగళవారం జరిగిన పరిణామాలతో ఆయన న్యాయ నిపుణులతో చర్చించారు.
అరెస్టు అవ్వనున్నారనే ఊహాగానాల మధ్య ముందస్తు బెయిల్‌కు రమేశ్ సిద్ధమైనట్లు తెలిసింది. బుధవారం ఆయన న్యాయస్థానంలో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జార్కిహొళి మంగళవారం బెళగావిలో ఉండగా, అక్కడి ఉప ఎన్నిక నామినేషన్ల కోసం సీఎం యడ్డ్యూరప్ప కూడా వచ్చారు. అయినా జార్కిహొళి సీఎంను కలవలేదు.