Bengaluru, Nov 8: తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటక పోలీసు కానిస్టేబుల్ 230 కిలోమీటర్లు ప్రయాణించి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సోమవారం భార్యను చున్నీతో హత్య చేశాడు. కాగా 11 రోజుల క్రితమే ఈ దంపతులకు పాప పుట్టింది. దారుణ ఘటన వివరాల్లోకెళితే..కర్ణాటకలో 32 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ కిషోర్ కుమార్‌కు, 24 ఏళ్ల ప్రతిభతో 2022 నవంబర్ 13న పెళ్లి జరిగింది. పది రోజుల కిందట బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పుట్టింట్లో ఉంటున్నది.
కాగా, భార్య మెసేజ్‌లు, కాల్ రికార్డ్స్‌ను రహస్యంగా పరిశీలించిన కిషోర్, స్నేహితులతో ఆమెకు విహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఆమె ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్న వారి గురించి ఆరా తీశాడు. ఈ క్రమంలో పుట్టింట్లో ఉన్న భార్య ప్రతిభకు ఆదివారం ఫోన్ చేసి తిట్టాడు. ఆమె ఏడ్వటంతో జోక్యం చేసుకున్న తల్లి ఫోన్ కట్ చేసింది. చంటి బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా భర్త ఫోన్‌కు సమాధానం ఇవ్వవద్దని చెప్పింది.
కిషోర్ ఆ తర్వాత భార్యకు 150 సార్లు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ తీయకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. వెంటనే చామరాజనగర్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్కోట్‌కు చేరుకున్నాడు. అక్కడికి వెళ్లే ముందే క్రిమిసంహారక మందు తాగిన భార్య ఇంటి తలుపు తట్టాడు. ఆ తర్వాత భార్య గదిలోకి వెళ్లి లాక్ వేశాడు. చున్నీతో ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం భార్యను చంపేశానని అరుస్తూ గది నుంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యను హత్య చేసే ముందు పురుగుల మందు తాగిన కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని గుర్తించారు. అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోలుకున్న తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.