Dharwad, April 11: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో RSSకు చెందిన కొందరు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ధార్వాడ్ పట్టణంలోని హనుమాన్ ఆలయం బయట ముస్లిం చిరువ్యాపారులపై దాడి జరిగింది. శ్రీరామసేన హిందూత్వ సంస్థకి చెందిన వారిగా చెబుతున్న కొంత మంది వ్యక్తులు వ్యాపారులు అమ్ముకునే పండ్లను చెల్లాచెదురుగా పడేయడం, రోడ్డుపై పగులకొట్టడం చేశారు. అదేవిధంగా తోపుడు బండ్లను (andalising Muslim Fruit Vendor's Shop) ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలని ఇటీవల పలు హిందూత్వ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా ఘటన జరగడం గమనార్హం.
నెగ్గికెరి అంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం RSS అనుబంధ సంస్థయిన ‘శ్రీరామ్ సేన’ గ్రూపునకు చెందిన కొంత మంది దాడులకు పాల్పడ్డారు. వాళ్లు దాడులు చేస్తున్నా.. సమీపంలోనే ఉన్న పోలీసులు అడ్డుకోలేదు. కాషాయ దుస్తులు వేసుకున్న ఓ వ్యక్తి ‘ముస్లిం వ్యాపారులకు అల్టిమేటం ఇచ్చాం’ అంటూ ఏకంగా పోలీసుతోనే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆలయ ప్రాంగణం నుంచి 15 రోజుల్లో ముస్లిం వ్యాపారులను వెళ్లగొట్టాలని దేవాలయ మేనేజ్‌మెంట్‌ను శ్రీరామ్ సేన హెచ్చరించింది. శనివారం నేరుగా దాడికి దిగింది.
15ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నామని.. ఈ విధంగా దాడులు చేస్తే ఎలా బతకాలని ముస్లిం వ్యాపారులు అవేదన వ్యక్తం చేశారు. హిందూ వ్యాపారుల దగ్గరే ..హిందువులు పళ్లు, కూరగాయలు కొనాలని హిందూ జనజాగృతి సమితి (బెంగళూరు) కోఆర్డినేటర్ చంద్రే మోగర్ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ దాడి జరగింది. కర్ణాటకలో ఇప్పటికే హిజాబ్, హలాల్, అజాన్ పేరుతో ఇక్కడి బీజేపీ ప్రభుత్వం రోజుకో మతతత్వ అంశాన్ని అజెండాలోకి తీసుకొస్తోంది.
ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ (Four Sri Ram Sena Activists Arrested) చేశామని కర్ణాటక పోలీసులు తెలిపారు. దాడి చేసిన వారిని చిదానంద కలాల్, కుమార్ కట్టిమణి, మైలారప్ప గుడ్డప్పనవర్ మరియు మహాలింగ అయిగాలిగా గుర్తించారు. ముస్లిం పండ్ల వ్యాపారి నబిషాబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేశామని ధార్వాడ్ రూరల్ పోలీసులు తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.