Hassan, May 31: మంగళవారం కర్నాటకలోని హాసన్ జిల్లాలోని అరసికెరె తాలూకాలో అగంతకులు ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత (Tension in Hassan District) నెలకొంది. మలేకల్లు తిరుపతి కొండ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ ఘటన (Temple Idols Vandalised) చోటుచేసుకుంది. 300 సంవత్సరాల పురాతన పుణ్యక్షేత్రాన్ని చిక్క (మినీ) తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయం అరసికెరె పట్టణానికి 2-కిమీ దూరంలో కొండపై ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉన్న విగ్రహాలను కనీసం నలుగురు దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం ఆలయ ప్రాంగణానికి వచ్చిన దుండగులు కల్యాణి (ఆలయంలోని పవిత్ర జలం)లో ఈత కొట్టారని పోలీసులు తెలిపారు. వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పొగతాగడంతోపాటు ఆవరణలో పనిచేస్తున్న కూలీలను బెదిరించి వెళ్లగొట్టారు. అనంతరం ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను పగలగొట్టేందుకు దుండగులు రాడ్లు, ఇతర సామగ్రిని ఉపయోగించారు.
విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్.శ్రీనివాస్ గౌడ్, జిల్లాలోని ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు దుండగులపై ఆధారాలు సేకరించారు. ఈ వార్త తెలియగానే హిందూ కార్యకర్తలు, వందలాది మంది ప్రజలు ఆలయ ప్రాంగణంలో గుమిగూడారు. పోలీసులు ప్రాంగణంలో భద్రతను పెంచారు మరియు అరసికెరె తాలూకాలో కూడా నిఘా ఉంచారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ రాజుకుంటున్నది. మం గళూరు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వాళ్లు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు. హిజాబ్ ధరించి కాలేజీలోకి వెళ్లేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన హిజాబ్‌గానీ, కాషాయ కండువాలుగానీ ధరించి కాలేజీలోకి రాకూడదంటూ అధికారులు తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సమాధానమిచ్చారు. అంతేగాక డ్రెస్‌కోడ్‌ను పాటించాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు.