Kasi, December 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను (Kashi Vishwanath Corridor) ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 3,000 మంది మత, ఆధ్యాత్మిక గురువులు, పూజారులు, ఇతర ప్రముఖుల సమక్షంలో మోదీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రారంభించారు. కాశీలో ప్రతి రాయి శివుడే.. కాశీకి సేవ చేయడం అనంతం.. కాశీ.. భారత సంస్కృతిక రాజధాని అని మోదీ అన్నారు.
అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉండాలన్నారు. భారతీయ సనాతన సంప్రదాయాలకు ప్రతీక వారణాసి అన్నారు. భారత్‌లో భక్తిని ఢీకొనే శక్తి దేనికీ లేదన్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన సమయం (Kashi Vishwanath Corridor Phase 1 Inaugurated by PM Narendra Modi) ఆసన్నమైందన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం విశ్వనాథ ఆలయంలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. నేటి భారత్.. కోల్పోయిన వైభవాన్ని అందుకుంటోందన్నారు. చోరీకి గురైన అన్నపూర్ణ విగ్రహం మళ్లీ వందేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిందన్నారు. దేశం కోసం మీరంతా మూడు సంకల్పాలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛత, సృజన్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం నిరంతరం ప్రయత్నం చేశాలని మోదీ అన్నారు. స్వచ్ఛత జీవన శైలి కావాలన్నారు. దేశం అభివృద్ధి ఎంత సాధించినా.. స్వచ్ఛత చాలా కీలకం అన్నారు. ఆత్మ నిర్భర భారత్ చాలా అవసరం అన్నారు.
కాశీ విశ్వనాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం కురిపించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా మోదీ కలియతిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులను మోదీ ఆప్యాయంగా పలుకరించి, ముచ్చటించారు. కార్మికులపై పూలు చల్లిన అనంతరం అందరితో కలిసి మోదీ ఫోటో దిగారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మోదీ పూలు చల్లిన సమయంలో పారిశుద్ధ్య కార్మికులు హర హర మహదేవ అని నినదించారు.
కాశీలో పర్యటిస్తున్న ప్రధానిమోదీ గంగా నదిలో పుణ్య స్నానం చేశారు. లలితా ఘాట్ వద్ద మోదీ జలతర్పణం చేశారు. గంగా మాతకు పుష్పాలు అర్పించారు. సూర్య భగవానుడికి పూజలు చేశారు. కాషాయ వస్త్రాల్లో.. గంగా జలాన్ని తీసుకుని ఆయన బాబా విశ్వనాథుడి వద్దకు వెళ్లారు. విశ్వనాథుడికి ఆ జలంతో అభిషేకం చేశారు. కాశీలో ఏది జరిగినా అది మహాదేవుడి కృపతో జరుగుతుందని ఆయన అన్నారు. ఇక్కడ కేవలం ఢమరుక సర్కార్ ఉంటుందన్నారు. అయోధ్యలో రామ మందిరమే కాదు.. మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామన్నారు. విశ్వనాథుడి జీర్ణోద్దరణ మాత్రమే కాదు.. అంతరిక్ష రంగంలోనూ ఇండియా వైభవంగా వెలుగుతోందన్నారు. దక్షిణ భారత దేశం కాశీ క్షేత్ర ఆనవాళ్లను ఆదిరిస్తుందన్నారు. ప్రాచీన, ఆధునికతకు కాశీ కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రతి భారతీయుడి తనకు శివుడి అంశమే అన్నారు.