KCR to inaugurate BRS office in New Delhi

New Delhi, DEC 14: దేశరాజకీయాల్లో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ సాధించి, రెండు సార్లు అధికారంలోకి వచ్చి...ఇప్పుడు జాతీయ స్థాయిలో తనదైన ముద్రను వేయాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్ (CM KCR). ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ ను బీఆర్ఎస్‌గా (BRS) మార్చారు. అందులో తొలి అడుగు వేయనున్నారు. ఢిల్లీలో సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని (BRS office) ప్రారంభించి, ఆ పార్టీ జెండాను ఎగరవేస్తారు. మధ్యాహ్నం 12.37 గంటలకు ఆ కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు కాసేపట్లో నవచండీ యాగం (Nava Chandiyagam) ప్రారంభం కానుంది. గణపతి హోమం కూడా జరుపుతారు.

తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే, దేశంలోని పలు రాష్ట్రాల నేతలు, రైతు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నిన్న కేసీఆర్‌ అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించి, యాగశాలను చూశారు. పార్టీ శాశ్వత భవన నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించి వెళ్లారు.

నవచండీ హోమం మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ఇందులో కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.