Thiruvananthapuram, SEP 25: కేరళలో ఇటీవల ఒక ఆటో డ్రైవర్ లాటరీలో (Kerala lottery) రూ.25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఓనం బంపర్ లాటరీలో (Bumper lottery) అనూప్ అనే ఆటో డ్రైవర్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. ఆ సమయంలో ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, లాటరీ గెలిచి వారం రోజులు కాలేదు.. తనకు మానసిక ప్రశాంతత కరువైంది అంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదని బాధపడుతున్నాడు. దీనికి కారణం చెప్పాడు అనూప్. ‘‘లాటరీలో పన్నులు, ఇతర బకాయిలు అన్నీ పోగా రూ.15 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటం వల్ల ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. వచ్చిన డబ్బుల్ని కొద్ది రోజులు బ్యాంకులోనే ఉంచుతాను. అయితే, లాటరీ గెలిచిన ఆనందం రెండు రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత మనశ్శాంతి కరువైంది, నిద్ర కూడా పట్టడం లేదు (lost peace of mind).
ఎందుకంటే నేను లాటరీ గెలిచిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తమ అవసరాలు తీర్చాలి అంటూ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఇంట్లో నివసించే పరిస్థితి కూడా లేదు. అందుకే నా అవసరాలు తీరేంత డబ్బు మాత్రమే వస్తే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడైనా ప్రశాతంగా ఉండేవాడిని. డబ్బులు వచ్చాయని తెలియగానే, నాకు తెలిసిన వాళ్లు చాలా మంది శత్రువులుగా మారుతున్నారు. లాటరీ డబ్బులు ఇంకా నాకు అందలేదు’’ అంటూ అనూప్ వాపోయాడు. ఈ సందర్భంగా బహుమతి తనకు ఎందుకు వచ్చిందా అనిపిస్తోంది అని వ్యాఖ్యానించాడు.