Kochi, DEC 29: కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో (JN Stadium) ఆదివారం సాయంత్రం 20 అడుగుల ఎత్తున గల గ్యాలరీ పై నుంచి కింద పడిన త్రిక్కకర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ (Uma Thomas) తీవ్ర గాయాల పాలయ్యారు. ఆమెను వెంటనే వాలంటీర్లు, ఈవెంట్ నిర్వాహకులు చికిత్స కోసం ప్రయివేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉమా థామస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని దవాఖాన వర్గాలు తెలిపాయి. మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం వెంటిలేటర్ మద్దతుపై (Ventilator Support) చికిత్స అందిస్తున్నామని ఆ వర్గాల కథనం.
వేదికపైకి వెళుతుండగా ఉమా థామస్ బ్యాలెన్స్ తప్పి, గ్యాలరీ నుంచి కింద పడినప్పుడు ఆమె తల నేలను తాకిందని సమాచారం. ప్రస్తుతం ఉమా థామస్ కు ఐసీయూలో (ICU) చికిత్స అందిస్తున్నామని కేరళ మంత్రి పీ రాజీవ్ తెలిపారు. రాష్ట్ర సీఎం విజయన్, ఆరోగ్యశాఖ మంత్రితో సంప్రదించామన్నారు. వివిధ విభాగాల వైద్య నిపుణులతో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.