ALAPPUZHA, Mar 9: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రితో కలిసి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేశాడు కసాయి కొడుకు. ఈ ఘటనలో తండ్రి ప్రమేయం కూడా ఉండటంతో ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో భరణిక్కవు సమీపంలోని కురతికాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అలప్పుజ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తండ్రి రామ్ మోహన్ మంగళవారం రాత్రి చిన్న కుమారుడు 30 ఏళ్ల మిథున్ మోహన్‌తో కలిసి మద్యం సేవించాడు.అయితే మద్యం అయిపోవడంతో మరింత మందు కావాలని తండ్రి అడగడంతో డబ్బులు కావాలని తల్లిని అడిగాడు కొడుకు. మద్యం తాగడం కోసం డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆగ్రహించిన చిన్న కుమారుడు మిథున్, గొంతు నొక్కి తల్లిని హత్య చేశాడు. అనంతరం తండ్రితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
మరుసటి రోజు మధ్యాహ్నం పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి చూడగా నేలపై తల్లి విగతజీవిగా పడి ఉండటం చూసి షాకయ్యాడు. తల్లి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన అతడు, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటికి చేరుకుని వృద్ధురాలైన రమ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిన్న కుమారుడు మిథున్ మోహన్ గురించి స్థానికంగా ఆరా తీశారు.మద్యం, డ్రగ్స్‌కు బానిస అయిన మిథున్ మోహన్ డబ్బుల కోసం పలుమార్లు తన తల్లిని కొట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.తల్లి హత్యలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు తెలుసుకుని అతన్ని కూడా అరెస్ట్ చేశారు.