Kottarakara, May 10: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయాలతో ఆసుపత్రికి తీసుకు వచ్చిన రోగి బుధవారం తెల్లవారుజామున మహిళా వైద్యురాలితో పాటు మరో నలుగురిని కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటనలో22 ఏళ్ల మహిళా హౌస్ సర్జన్ మరణించింది. కొట్టారకరలోని ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు హింసాత్మక స్థితిలో ఉన్న వ్యక్తి వందనా దాస్‌కు చికిత్స చేస్తున్నప్పుడు సర్జికల్ బ్లేడ్‌ను తీసుకుని ఆమెపై పలుసార్లు దాడి చేశాడని వైద్య అధికారి తెలిపారు.ఆమెకు అత్యవసర చికిత్స అందించబడింది. రాజధాని నగరంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించబడింది. ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ప్రాణాలను కాపాడాలేకపోయామని అని సీనియర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ చెప్పారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కొల్లాం జిల్లాలోని పూయపల్లికి చెందిన 42 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయుడు సందీప్ తన ఇంటిలో గొడవ సృష్టించాడు. గాయపడిన తరువాత పోలీసులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగా సర్జికల్ బ్లేడ్ తీసుకుని ఒక్కసారిగా వైద్యురాలిపై దాడి చేశాడు. విచిత్రమేమిటంటే కొంతమంది పోలీసు అధికారులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనతో వందలాది మంది వైద్యులు ఆమె మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రికి చేరుకున్నారు. హామీలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే సమ్మె చేస్తున్నామని, ఇకపై ఎలాంటి హామీలు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు.