Kuldeep Singh Sengar (Photo Credits: IANS)

New Delhi, December 16:  ఉన్నావ్ అత్యాచారం కేసు (Unnao Rape-Kidnapping Case)లో నిందితుడిగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌ (Kuldeep Singh Sengar)ను దోషిగా తేలుస్తూ దిల్లీ కోర్టు (Delhi's Tis Hazari Court) సోమవారం తీర్పు వెలువరించింది. కుల్దీప్ సింగ్ పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 లైంగిక నేరాల చట్టం కింద మరియు లైంగిక దాడుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే (POCSO) చట్టంలోని సెక్షన్ 5 (సి) మరియు సెక్షన్ 6ల కింద అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో కుల్దీప్ తో పాటు శశి సింగ్ ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇక  వీరికి ఖరారు చేయాల్సిన శిక్షలపై డిసెంబర్ 19న వాదనలు విననుంది.

ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో 2017లో ఓ మైనర్ బాలిక కిడ్నాప్ మరియు అత్యాచారానికి గురైంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు బాధితురాలు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినపుడు ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో యూపీలోని బంగార్‌మౌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుల్దీప్ సింగ్ సెంగార్‌ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.

బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసిన మరుసటి రోజు కుల్దీప్ సెంగార్ కుటుంబం బాధితురాలి తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.  అయితే వారం రోజులకే పోలీసుల జ్యుడిషిల్ కస్టడీలో అతడు చనిపోవడం కూడా తీవ్ర సంచలనం రేపింది

ఈ కేసు నుంచి బయటపడేందుకు కుల్దీప్ శతవిధాల ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం అవుతున్న తరుణంలో, జూలై 28న బాధితురాలు తన లాయర్ మరియు బంధువులతో కలిసి  ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు తీవ్రగాయాల పాలై ప్రాణాలతో బయటపడగా, ఆమెతో ప్రయాణిస్తున్న ఇద్దరు బంధువులు మరణించారు, లాయర్ కూడా తీవ్రగాయాల పాలయ్యాడు. ఇది కుల్దీప్ సింగ్ చేయించిన యాక్సిడెంట్ అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

ఈ అత్యాచారానికి సంబంధించిన కేసులో గత ఏడాది ఏప్రిల్ 13న కుల్దీప్ సింగ్ అరెస్టయ్యాడు, అప్పట్నించి తీహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసు కారణంగా బీజేపీ నాయకత్వం ఈ ఏడాది ఆగష్టులో కుల్దీప్ ను పార్టీ నుంచి బహిష్కరించింది.

2017లో బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి వివిధ ప్రదేశాలలో 9 రోజుల పాటు అత్యాచారం చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జిషీట్ దాఖలు చేసింది.  ఈ కేసులో బంగార్‌మౌనియోజకవర్గానికి అప్పుడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కుల్దీప్ సింగ్ సెంగార్‌ ప్రధాన నిందితుడని చార్జిషీట్లో పేర్కొంటూ, ఏప్రిల్ లో అతణ్ని సీబీఐ అరెస్ట్ చేసింది.

కాగా,  కేసులో ప్రస్తుతం దోషిగా నిర్ధారణ కాబడ్డ కుల్దీప్ సింగ్ కు గరిష్ఠంగా జీవితఖైదు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.