New Delhi, October 26: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ వద్ద రైతుల ర్యాలీపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు కారుతో దూసుకెళ్లి, రైతుల మృతి కారకుడైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది. ఈ కేసుకు (Lakhimpur Kheri Violence Case) సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీం..లఖింపూర్ ఖేరి ఘటనలో సాక్షులకు భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని (upreme Court Questions UP Govt ) మంగళవారం ఆదేశించింది.
ఈ ఘటనలో ఇతర సంబంధిత సాక్షుల స్టేట్‌మెంట్లను జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ల ఎదుట రికార్డు చేయాలని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని కోరింది. పలువురు సాక్షుల స్టేట్‌మెంట్లను ఇంకా నమోదు చేయాల్సి ఉందని యూపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, గరిమ ప్రసాద్‌లు సర్వోన్నత న్యాయస్ధానానికి వివరించిన మీదట కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఘటన సమయంలో నాలుగైదు వేల మంది ఉంటే కేవలం 23 మంది సాక్షులే దొరికారా? అని ప్రశ్నించింది. 164 నిబంధన కింద ఎందరు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారని, సాక్షుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది.
లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళన సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించిన ఘటనలో 68 మంది సాక్షులకు గాను కేవలం 20 మంది సాక్షులే తమ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే తెలిపారు. ఈ క్రమంలో ధర్మాసనం... గాయపడిన వారెవరైనా సాక్షుల్లో ఉన్నారా అని అడిగింది. కీలక నిందితుల విషయం ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఆధారాలపై నివేదికల తయారీ విషయంలో తమ ఆందోళనను ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, నిపుణులకు తెలపాలని సుప్రీం బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని కోరింది. జర్నలిస్ట్ మూక హత్య సహా రెండు ఫిర్యాదులపై నివేదిక సమర్పించాలని కూడా సర్వోన్నత న్యాయస్ధానం యూపీ ప్రభుత్వాన్ని కోరింది.
విచారణ వేగవంతం చేస్తారా? లేదా? అంటూ ప్రశ్నించింది. విచారణ తీరు ఇలాగే కొనసాగితే ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. సాక్షులకు పూర్తి భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 164 నిబంధన కింద వాంగ్మూలం నమోదు సత్వరమే పూర్తిచేయాలని నిర్దేశించింది. దర్యాప్తులో తగిన నియమావళిని అనుసరించాల్సిందేనని, సాక్షుల వాంగ్మూలాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని స్పష్టం చేసింది.లఖింపూర్ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్ ల పైనా నివేదిక ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అటు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్న ఆధారాలపై పరిశోధన వేగవంతం చేసి నివేదికలు అందజేయాలని సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ఈ కేసును నవంబరు 8కి వాయిదా వేసింది.
కాగా లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందినదిగా భావిస్తున్న ఎస్‌యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించగా అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.