Lakhimpur Kheri, Oct 5: యూపీ లఖింపూర్ ఖేరి ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా 11 మందిపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు (FIR filed against Priyanka Gandhi, 10 others) చేశారు. లఖింపూర్ ఖేరిలో ఆదివారం ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి ఎస్‌యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించడం తెలిసిందే.
ఆ తర్వాత చెలరేగిన అల్లర్లలో (Lakhimpur Kheri Violence) మరో నలుగురు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన నేపధ్యంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీని (Priyanka Gandhi) సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో గత రెండు రోజులుగా నిర్బంధించారు. ఇక ఘటనా ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకూ ఎందుకు సందర్శించలేదని ప్రియాంక ప్రశ్నించారు.
లఖిమ్‌పూర్ ఖేరిలో (Lakhimpur Kheri Incident) రైతులపైకి కారుతో దూసుకెళ్లాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిశ్ మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఈ ఘటనపై మరోసారి స్పందించారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో తన కొడుకు అక్కడ ఉన్నట్లు ఒక్క ఆధారం దొరికినా తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ అజయ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి కొడుకే తన కారుతో రైతులపైకి దూసుకెళ్లాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆశిశ్ మిశ్రాపై పోలీసులు హత్య కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆ సమయంలో తన కొడుకు అక్కడ లేడని, ఆందోళనకారులే కారుపై రాళ్ల దాడి చేసి డ్రైవర్ సహా ముగ్గురిని హత్య చేశారని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన రైతులపై ఎస్‌యూవీ దూసుకుపోతున్న వీడియోను కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ ఈ దృశ్యాలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల వ్యవస్ధకు ఈ ఫోటోలు, వీడియోలు సిగ్గుచేటన్నారు. రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
ఇంకా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు : అఖిలేష్ యాదవ్
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మరోసారి స్పందించారు. బీజేపీ నేతలు వాహనాలతో రైతులను తొక్కించారని, దాంతో కొందరు రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా అతను ఇంకా పదవిలో కొనసాగుతున్నారని కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంట్లోని నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎలా వెళ్లగలరని ఆయన ప్రశ్నించారు.
కేంద్రమంత్రి తన పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని, ఈ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ కావాల్సిందేనని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. పరిస్థితిని బట్టి చూస్తుంటే బీజేపీ సర్కారు బాధితుల న్యాయం చేసేలా కనిపంచడం లేదన్నారు. రైతులు ఈ ప్రభుత్వ అధికారాన్ని ఊడగొట్టాలని పిలుపునిచ్చారు. ఘటనకు సంబంధించిన వీడియోలను చూసినా, ప్రత్యక్ష సాక్షలు చెబుతున్న వివరాలు విన్నా మంత్రి కొడుకే రైతులపైకి వాహనాలు పోనిచ్చినట్లు తెలుస్తుందని అఖిలేష్ చెప్పారు. అదేవిధంగా తమకు త్వరలోనే మరో రథయాత్ర నిర్వహించే అవకాశం రాబోతున్నదని, ఈసారి చేపట్టబోయే యాత్ర సమాజ్‌వాది పార్టీ విజయ యాత్రేనని అఖిలేష్ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీజేపీ పాలనపై ఉత్తరప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు.
నిందితుడు అరెస్ట్ కావాల్సిందే : లాలూ ప్రసాద్ యాదవ్ :
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. దేశం నిరుద్యోగం, ధరల మంటతో అల్లాడుతుంటే బీజేపీ మతతత్వ పోకడలను అనుసరిస్తూ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. రక్తం రుచిమరిగిన బీజేపీ ముస్లింలపై హిందువులను ఎగదోస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ పాలిత యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనలను లాలూ తీవ్రంగా ఖండించారు.
విపక్షాలు తమ విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాడితే బీజేపీని మట్టికరిపించవచ్చని అన్నారు. బీసీ కులగణన చేపట్టలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడం పట్ల లాలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను త్వరలోనే బిహార్‌లో అడుగుపెడతానని, తన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని లాలూ తెలిపారు. బిహార్‌లో నితీష్ సర్కార్‌పైనా లాలూ తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీని కలిసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్:
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను యూపీ పోలీసులు గత రెండు రోజులుగా నిర్బంధంలో ఉంచారు.
ఇక రాహుల్‌తో భేటీకి ముందు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సర్కార్ తీరును ఎండగట్టారు. ప్రియాంక గాంధీ అరెస్ట్ నేపధ్యంలో రాహుల్‌తో సమావేశమవుతున్నానని..చట్టం దృష్టిలో అందరూ సమానమైతే ప్రియాంక గాంధీ జైలులో ఉంంటే మంత్రి స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు.
రైతుల అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకారం:
లఖింపూర్ ఖేరిలో నిరసన తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించిన రైతులను కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని వాహనంతో తొక్కించి చంపిన ఘటనపై యూపీలో తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఈ క్రమంలోనే ఈ ఘటనలో మరణించిన ముగ్గురు రైతుల కుటుంబసభ్యులు వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించారు. అయితే, అంతకుముందు వారు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెగేసి చెప్పారు. ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్టుమార్టం నివేదికలను తమకు ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని లేదంటే లేదని వారు స్పష్టంచేశారు. ఇప్పుడు వారి డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో అంత్యక్రియలు సమ్మితించినట్లు సమాచారం.
చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగల్ ధర్నా:
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో ఇవాళ చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగల్ ధర్నా చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఆయన ఫ్లోర్‌పై కూర్చుని పోలీసుల ప్రవర్తనపై నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో బైఠాయించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన ఘటనను ఖండిస్తూ ఆయన యూపీ పర్యటనకు వచ్చారు. ఎటువంటి ఆదేశాలు లేకున్నా.. తనను విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు భూపేశ్ భగల్ తెలిపారు. ప్రియాంకాను కలిసేందుకు వెళ్తున్నట్లు సీఎం భూపేశ్ తెలిపారు. కానీ లక్నో పోలీసులు మాత్రం ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులతో సంభాషించే వీడియోను కూడా భూపేశ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఘటన జరిగిందిలా..
ఈ నెల రెండున కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరిలో రైతులు ధర్నా చేస్తున్నారు. అదే సమయంలో లఖింపూర్ ఖేరిలో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రికి వ్యవసాయ చట్టాలపై తమ నిరసన తెలిజేసేందుకు కొందరు రైతులు రోడ్డులపై బైఠాయించారు. అటుగా మంత్రి కాన్వాయ్ అటుగా రాగానే పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో ఓ వాహనం రైతులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైతులను తొక్కించిన వాహనాన్ని మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశీష్ మిశ్రా నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ మంత్రి అజయ్ మిశ్రా మాత్రం ఘటన జరిగిన సమయంలో తానుగానీ, తన కొడుకుగానీ అక్కడ లేమని చెప్పారు.
దానికి సంబంధించిన 25 సెకన్ల వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పోస్టు చేశారు వైరల్ అయిన వీడియోలో ఆ వాహనం వెనుక మరో వాహనం సైరెన్లతో వెళ్లింది. కారు అకస్మాత్తుగా వచ్చి తమను ఢీకొట్టినట్లు రైతులు చెప్పారు.మంత్రి కాన్వాయ్‌లోని కారు బీభత్సం సృష్టించిన తర్వాత.. రైతులు భారీ విధ్వంసానికి దిగారు. ఆ ఘర్షణల్లో కొందరు చనిపోయారు. వాహనాలకు నిప్పుపెట్టారు. మంత్రి మిశ్రా కుమారుడిపై మర్డర్ కేసు పెట్టారు. చనిపోయిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్డ్ జడ్జితో ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు.