హిండెన్ బర్గ్ రీసెర్చ్ దెబ్బకు అదానీ సామ్రాజ్యం కుప్పకూలిపోతోంది. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్ల విలువ భారీగా పడిపోతోంది.లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి.కాగా అదానీకి సంబంధించిన కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ యాజమాన్యంతో మాట్లాడుతామని ఎల్ఐసీ (LIC Clarifies on Adani Stocks) తాజాగా ప్రకటించింది. తాము అదానీ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టామని, అవసరమైన మేరకు ప్రశ్నించే హక్కు తమకు ఉందని వ్యాఖ్యానించింది.
అదానీ గ్రూప్ ఆస్తులలో పెట్టుబడి పెట్టిన తన సంపద దాదాపు రెట్టింపు అయిందని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పేర్కొంది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఈక్విటీ, డెట్ కింద ఎల్‌ఐసి మొత్తం హోల్డింగ్ 31.12.2022 నాటికి రూ. 35,917.31 కోట్లు. అన్ని అదానీ గ్రూప్ కంపెనీల కింద గత అనేక సంవత్సరాలుగా కొనుగోలు చేసిన ఈక్విటీ మొత్తం కొనుగోలు విలువ రూ. 30,127 కోట్లు. 2023 జనవరి 27న మార్కెట్ అవర్స్ ముగిసే సమయానికి మార్కెట్ విలువ రూ.56,142 కోట్లు. అదానీ గ్రూప్ కింద పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. ఇప్పటి వరకు 36,474.78 కోట్లు. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లు కొంత వ్యవధిలో చేయబడ్డాయని మింట్ మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ LIC తెలిపింది.
“LIC కలిగి ఉన్న అన్ని అదానీ డెట్ సెక్యూరిటీల క్రెడిట్ రేటింగ్ AA మరియు అంతకంటే ఎక్కువ అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వర్తించే IRDAI పెట్టుబడి నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఎల్‌ఐసి నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ. సెప్టెంబరు 30, 2022 నాటికి 41.66 లక్షల కోట్లు. కాబట్టి, అదానీ గ్రూప్‌లో LIC యొక్క ఎక్స్పోజర్, తేదీ ప్రకారం, పుస్తక విలువ ప్రకారం LIC యొక్క మొత్తం AUMలో 0.975%," అని మింట్ ప్రశ్నకు ప్రతిస్పందనగా LIC తెలిపింది.
BSE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివిధ అదానీ గ్రూప్ కంపెనీల తాజా షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, LICకి.. 6,55,88,170 అదానీ టోటల్ గ్యాస్ షేర్లు లేదా కంపెనీలో 5.96 శాతం వాటా ఉంది. అదానీ పోర్ట్స్‌లో, ఎల్‌ఐసికి 19,75,26,194 షేర్లు లేదా కంపెనీలో 9.14 శాతం వాటా ఉంది. అక్టోబరు నుండి డిసెంబర్ 2022 త్రైమాసికానికి సంబంధించిన షేర్ హోల్డింగ్ సరళి ప్రకారం, ఈ అదానీ గ్రూప్ కంపెనీలో LIC.. 4,81,74,654 అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను లేదా 4.23 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే, ఎల్‌ఐసికి 4,06,76,207 అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు లేదా కంపెనీలో 3.65 శాతం వాటా ఉంది.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పాలసీదార్ల నుంచి ప్రీమియంగా వసూలు చేసిన సొమ్ములో భారీ మొత్తం అదానీ షేర్లలో కరిగిపోయింది. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు రెండు రోజుల్లోనే రూ.18,000 కోట్లకుపైగా తరిగి పోయాయి. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఈ నెల 24 నాటికి ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.81,268 కోట్లు ఉండగా, శుక్రవారం నాటికి రూ.61,621 కోట్లకు పడిపోయింది.
అదానీ కంపెనీల్లో దేశంలో ఏ మ్యూచువల్ ఫండ్ చేయనంత భారీగా ఎల్‌ఐసీ సరళంగా పెట్టుబడి పెట్టింది. వాస్తవానికి ఆ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్ గౌతమ్ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్ ఎల్‌ఐసీయే. దేశంలోని టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ ఒక్కదానికీ అదానీ కంపెనీల్లో 1 శాతం వాటా మించి లేదు. కానీ ఎల్‌ఐసీకి ఐదు అదానీ కంపెనీల్లో 1 శాతంపైగా వాటా ఉన్నది. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో గౌతమ్ అదానీ తర్వాత పెద్ద ఇన్వెస్టర్ ఎల్‌ఐసీయే. అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా జారీచేసిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవో పరిమాణంలో ఐదు శాతం షేర్లకు ఎల్‌ఐసీ బిడ్ వేసింది. ఆ షేర్లను ఇప్పటికే ఎల్‌ఐసీకి కంపెనీ కేటాయించేసింది కూడా.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2021 జూన్ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది. ఇదేరీతిలో అదానీ టోటల్‌గ్యాస్‌లో 2.11 శాతం నుంచి 5.77 శాతానికి, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.42 శాతం నుంచి 3.46 శాతానికి ఏడాదికాలంలోనే పెంచుకుంది. అదానీ పోర్ట్స్‌లో మాత్రం ఎల్‌ఐసీ వాటా 11.9 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.15 శాతం వాటా ఎల్‌ఐసీకి ఉన్నది. అదానీ పవర్‌లో 1 శాతం మేర వాటా ఉన్నది. వీటిలో మొత్తం పెట్టుబడుల విలువ రూ.70,000 కోట్లు.
ఇవి కాకుండా ఇటీవల అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన అంబూజా సిమెంట్స్, ఏసీసీల్లో సైతం ఎల్‌ఐసీకి షేర్లున్నాయి. వీటి విలువ రూ. 10,000 కోట్లకుపైనే. తాజాగా ఈ మొత్తం పెట్టుబడులే రెండ్రోజుల్లో 15 శాతానికి పైగా తరిగిపోవడమే కాదు…రానున్న రోజుల్లో మరింత పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అదానీ సంస్థల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు
అదానీ ఎంటర్‌ప్రైజెస్:
మొత్తం షేర్లు : 4,81,74,654 (ఇది కంపెనీ చెల్లించవలసిన మొత్తం క్యాపిటల్‌లో 4.23 శాతం)
గత రెండు మార్కెట్ సెషన్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒక్కోషేర్ ధర రూ.673.5 నష్టపోయింది. దీంతో షేర్ ధర రూ.3,442 నుంచి రూ.2,768.50కు చేరటంతో ఎల్ఐసీ రూ.3,245 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
అదానీ పోర్ట్స్
మొత్తం షేర్లు: 19,75,26,194 (అదానీ పోర్ట్స్ కంపెనీ వాటాలో 9.14 శాతంతో సమానం)
గత రెండు మార్కెట్ సెషన్స్‌లో అదానీ పోర్ట్స్ షేరు ధర రూ.156.70 పడిపోయింది. ఒక్కో షేరు ధర రూ.761.20 నుంచి రూ.604.50కు చేరింది. దీంతో ఎల్‌ఐసీ రూ.3,095 కోట్ల సంపదను కోల్పోయింది.
అదానీ ట్రాన్స్‌మిషన్
మొత్తం షేర్లు : 4,06,76,207 (ఇది కంపెనీ వాటాలో 3.65 శాతంతో సమానం)
రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో ఈ షేరు ధర రూ.747.95 తగ్గింది. షేరు విలువ రూ.2,762.15 నుంచి రూ.2,014.20కు పడిపోయింది. దీంతో ఎల్‌ఐసీ రూ.3,042కోట్ల నష్టాన్ని చవిచూసింది.
అదానీ గ్రీన్
మొత్తం షేర్లు : 2,03,09,080
అదానీ గ్రీన్ షేరు ధర గత రెండు రోజుల్లో రూ.430.55 తగ్గింది. దీంతో రెండు సెషన్లలో ఎల్‌ఐసీకి దాదాపు రూ.875 కోట్ల నష్టం వాటిల్లింది.
అదానీ టోటల్ గ్యాస్
మొత్తం షేర్లు: 2,03,09,080
అదానీ టోటల్ గ్యాస్ షేరు ధర గత రెండు రోజుల్లో రూ.963.75 తగ్గింది. దీంతో ఎల్‌ఐసీకి దాదాపు రూ.6,323 కోట్ల నష్టం వాటిల్లింది.
కాగా ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వాస్తవ పరిస్థితులేంటో మాకు తెలియదు. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన సంస్థగా ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది. వారితో కలిసి మాట్లాడుతాం’ అని ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ వెల్లడించారు. తాము ఆందోళన చెందుతున్న అంశాలపై ఏ విధమైన సమాధానం వస్తుందో చూస్తామని.. ఒకవేళ సరైన సమాచారం రాకుంటే మరింత స్పష్టత కోరతామని చెప్పారు.
మరోవైపు షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై స్పందించిన అదానీ గ్రూప్ స్పందించింది. ఇదొక కంపెనీపై చేసిన దాడి కాదని, భారత్ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అయితే అదానీ గ్రూప్ స్పందనకు దీటుగా బదులిచ్చిన హిండెన్‌బర్గ్.. జాతీయవాదం పేరు చెప్పి మోసాన్ని దాచి ఉంచలేరని స్పష్టం చేసింది.