New Delhi, Feb 13: ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది.. భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తమ ఐపీవోకు (IPO) అనుమతించాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి(SEBI) ఆదివారం దరఖాస్తు చేసింది. 31.6 కోట్ల షేర్లను అంటే ఐదు శాతం వాటాలను ఐపీవో (IPO) ద్వారా విక్రయిస్తామని తెలిపింది. ఈ సంగతి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (DIPAM) కార్యదర్శి తుహిన్ కాంతా పాండే (Tuhin Kanta Pandey) ట్వీట్ ద్వారా తెలిపారు. తద్వారా రూ.71 వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సెబీ (SEBI)ముందు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీంతో ఎల్ఐసీలో 31,62,49,885 షేర్లు విక్రయించనున్నది. దీనిపై ఫ్రెష్ ఇష్యూ ఉండదు. 100 శాతం ఓఎఫ్ఎస్ ద్వారా ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని తుహిన్ కాంతా పాండే తెలిపారు.
LIC IPO DRHP is available on the SEBI’s website https://t.co/RZtSUnvmy7 pic.twitter.com/P9yyFsNWZC
— Secretary, DIPAM (@SecyDIPAM) February 13, 2022
ఎల్ఐసీ ఎంబీడెడ్ విలువ రూ.5.39 లక్షల కోట్లు. ఐపీవోలో పాలసీదారులకు 10 శాతం వాటాలను ఎల్ఐసీ విక్రయించనున్నది. ఉద్యోగులకు కొంత రిజర్వేషన్ కల్పించనున్నది. భారత బీమా రంగంలో ఎల్ఐసీ వాటా 66 శాతం. గతేడాది మార్చి నెలాఖరు నాటికి 283 మిలియన్ల పాలసీలు, 1.35 మిలియన్ల మంది ఏజంట్లు సంస్థలో పని చేస్తున్నారు.
ఎల్ఐసీ ఐపీవో ఆఫర్ సైజ్ రూ.27 వేల కోట్లు ఉంటుందని, మూడు రెట్ల విలువ గల షేర్లు విక్రయిస్తారని తెలుస్తున్నది. ఎల్ఐసీ ఐపీవో ఖరారైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వాటాల ఉపసంహరణతో రూ.78 వేల కోట్ల నిధులు సేకరించాలన్న లక్ష్యం నెరవేరిసట్లే. ఇంతకుముందు ఎల్ఐసీ ఐపీవో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని తుహిన్ కాంతా పాండే చెప్పారు. ఇదిలా ఉంటే, ఎల్ఐసీ ఐపీవో కోసం ప్రభుత్వం 10 మర్చంట్ బ్యాంకులను నియమించింది.